29 ఆగ, 2010

ఊపిరి సలపని ఉత్కంఠ

ఊయల ఊగుతుందే
ముందుకూ వెనక్కూ
అల్లానే ఊగుతూ ఉండేదప్పుడు
నా గుండె కూడా అలసట లేకుండా
కవాటాలు తుత్తునియలు అయిపోతాయేమో
రక్తనాళాలు ఉత్కంఠ భరించలేక
విస్పోఠన చెందుతాయేమో నన్న
ఉత్కంఠ నిండి ఉండేది
అప్పుడు మోయడానికి
జ్ఞాపకాలు లేవు ఉట్టి గాయాలు తప్ప
అడుగు తీసి అడుగేద్దామంటే నిప్పులు కాల్తున్న భయం
అయినా సరే ఆపలేని మునివేళ్ళ మీద ప్రయాణం
ఒక్కోరోజు కుంపటి మీద కాగుతూ కూడా
పీడ కలల్ని భరించాల్సి వొచ్చేది
అప్పుడప్పుడైనా పంచుకుందామని దోసిలి నిండా
కలలు తీసుకునేవాణ్ణి
తల పైకెత్తి చూస్తే
కళ్ళ ముందు అంతా శూన్యం
ఎవరో చుట్టూ మూగి ఉన్నా
కళ్ల లోతుల్లో కనిపించని భావాల్ని
చదవలేని తడబాటు
గాయాల్నిలా మోసుకు తిరుగుతున్న కొద్దీ
కాలి బాట మరింత ఇరుకిరుగ్గా
ముళ్ళ పొదలతో తుప్పలతో
రాళ్ళూ రప్పలతో గీరుకుపోయిన
పచ్చి పుండు అయ్యేదేమో
ఇప్పటికైనా మేలుకోవడం మంచిదే అయ్యింది
ప్రాణాలైనా మిగిలి బ్రతికి బయట పడి పోయానుకదా

19 ఆగ, 2010

ఆనందోత్సాహం

చిగురుటాకంత స్నేహం కోసం

చినుకు రాలినంత ఆప్యాయతా సుమం కోసం

పువ్వు పుష్పించినంత వసంతం కోసం

గాలి సవ్వడంత ఆనందం కోసం

మరుమల్లెల సువాసనంత మధురిమకోసం

పుప్పొడి చప్పుడంత నిశ్శబ్దంతో

కలువల కళ్ళు విప్పార్చుకుని

ఆకాశంలో మబ్బుల్నీ

అవి వర్షించే వర్షపు ధారల్నీ

రెప్ప వాల్చకుండా వొచ్చే

చిరుజల్లుల వెన్నెల తెచ్చే

వర్షపు ధారల్నీ

ఒక ఆత్మీయుని ఆత్మీయత కొసం

ఇంకో ఆత్మ ఆర్థ్రంగా ఆప్యాయంగా

కళ్ళు కాయలు కాచేలా

చూపుల అగాధాల్లో

ఎదురు చూస్తూ చూస్తూ ఉండడం

ఎంత ఆనందోత్సాహమోగదా

17 ఆగ, 2010

బోసి నవ్వుల దేహ భాష

దిక్కు తోచని ప్రపంచపు
రోదనారణ్యాలలో
బోసినవ్వుల స్వర్గ దేహ భాషలు
ఏడుపులూ నవ్వులూ
అంతటా ఒకటే సంగీతం
నిద్రలోనూ మెలకువలోనూ
పెదవులపై అదే చిరు దరహాసపు
చెదరని లేలేత పువ్వుల భాష
ఎవ్వరూ పట్టని ఏ అవసరమూ లేని
ఉంగా ఉంగాల అందాల భాష
సాగుతూ ప్రాకుతూ
అదో విముక్త లోకపు మాయ భాష
పెదాలపై ఎప్పుడూ చెరగని చిరునవ్వుల చిలిపి భాష
స్వార్థాలసలే ఉండని కోపతాపాల్లేని ఒక్కటే కొంటె భాష
కడుపు ఖాళీ అయినపుడు మాత్రం ఆకలి భాష
సుస్తీ చేసినప్పుడైతే ఏడుపుల శోష భాష
ఇదో అద్భుతమైన అందాల అమాయక విశ్వభాష

10 ఆగ, 2010

శాంతివనం - సేవాసదనం

శాంతివనం - సర్వ సామాజిక సమ్మేళనం

ఎందరో అనాధలు అభాగ్యులున్నపుణ్యభూమి మనది.ఆ పుణ్యభూమిలో మనమూ పుట్టాం. పుట్టిన భాగ్యానికి మేమూ ఉన్నామనే విషయం గుర్తు చేసుకుందాం. మావంతుగా మేమూ ఎంతో కొంత సమాజానికి చేయూత నిద్దామని భావించాం.అందుకే ఒక అడుగు ముందుకు వేస్తున్నాం.అశాంతిలో ఉన్న సమాజానికి ఎంతో కొంత శాంతిని కలుగజేద్దామనే ఉద్దేశంతో ముందడుగు వేసి శాంతివనం స్థాపనకు పూనుకున్నాం.శాంతివనం ప్రథమ కర్తవ్యంగా అనాధ శిశువులకు చేయూతనిద్దాం అనుకున్నాం

ఎవ్వరూ నా అనేవాళ్ళు లేని పసిపిల్లలు ,అమ్మానాన్నా లేని అనాథలు ,పాపం పసివాళ్ళు వీళ్ళకు ఏదో దారి చూపించాలని మీకు అనిపిస్తే శాంతివనానికి తెలియజేయండి.5-10 సం: పిల్లల్ని బడికి పంపించి చదివించి వాళ్ళకు మేము చేయూత నిస్తాం. వాళ్ళకు మేమున్నామనే భరోసా కలిగిస్తాం.

సమాజములో కుళ్ళును కడిగి వెయ్యాలనుకునే వాళ్ళు,మానవత్వంతో స్పందించేవాళ్ళు,అనాధల పట్ల దయ కలిగినవాళ్ళు,అభాగ్యులను ఆదుకునేవాళ్ళుపిల్లల పట్ల ప్రేమ కలిగినవాళ్ళు,భాషాభిమానం కలిగిన వాళ్ళు,సంస్కృతి,సాహిత్యం,పర్యావరణం పట్ల అభిమానం ఉన్న వాళ్ళు మాతో చేయి చేయి కలపండి.అందరమూ కలిసి సమాజానికి చేయూత నిద్దాం.మనందరమూ కలిసి ఒక మెరుగైన సమాజాన్ని నిర్మిద్దాం.శాంతివనంలో సేవ, సంస్కృతి,సాహిత్యం,భాషా సంపదలను వెల్లివిరియజేద్దాం.

సంప్రదించడానికి:శింగరాయకొండ-9866343823 , ఒంగోలు-9949535695, మేఘ ఇ.ఎన్.టి.హాస్పిటల్.సుందరయ్య భవన్ రోడ్

27 జులై, 2010

వారధి రచయితల సహకార వేదిక

వారధి రచయితల సహకారం తో పుస్తక ప్రచురణ
రచయితలు సమావేశాలు
వర్తమాన సాహిత్యంలో చర్చోపచర్చలు
యువరచయితల కు ప్రోత్సాహం
తెలుగు సాహిత్యాన్ని ఇతర భాష లలోనికి అనువాదాలు
కథా వర్క్ షాపులు నిర్వహించుట
రచయితలు అంతరంగా విష్కరణలు
మనలో లోపాలను కూడా అవలోకనం చేసుకోవడానికి సమావేశాలు
ఇవన్ని వారధి సహకార వేదిక లో నే సాధ్యం అందుకే ఇది రచయితల సమీకరణ

22 జులై, 2010

హిమాలయాలు- చివరి అంకం



గుడారాల్లో మేము
కొండలపై ఎలుగుబంట్లు
లోయల్లో చెట్లు
చెట్లపైన బుల్లిబుల్లి పిట్టలు
అడవి మనుషులం కాదా మనం

ఆ కొండంచుకు తెల్లటి దివిటీలా
చంద్రుణ్ణి
వేలాడదీసి వెళ్ళిపోయారెవరో

నక్షత్రాలన్నీమూకుమ్మడిగా
ఆకాశం నుండి దిగి వొచ్చి
మనుషుల్తో మాట్లాడుతున్నాయి
భూలోకమెలాగుందని
పలకరిస్తున్నాయి

ఆహాహా
ఇదెంత మంచు చల్లని
మెత్తని కత్తిలా కోసే
హాయి సముద్రం

ఇంద్రధనుస్సులో రంగులన్నీ తీసి
ఇక్కడే హోలీ ఆటాడుతున్నారెవరో

ఆ కొండలపై ఎంతమంది
నిర్విరామంగా శ్రమించి
ఈ తెల్లటి మంచు వెల్ల వేశారో

కొమ్మలు తలలు వంచి
ఆశీర్వదిస్తున్నాయి
సాహసికుల్లారా వెళ్ళిరండని
జీవన సారాన్ని ఆస్వాదించడానికి
వయోభేదాలు లింగ వివక్షలు
భాషాభిమానాలు లేవులెమ్మని
సాగనంపుతున్నాయి

పాపం మందలో నుండి తప్పిపోయిన
గొర్రెపిల్లలా లాగుంది
ఆ ఒక్క పువ్వు
నీలం రంగులో వెలిగి పోతూ

ఒక్కో వైపు ఒక్కో రకంగా
వగలు పోతున్నాయా కొండలు

ఎంతమంది దాటుతారు నన్ను
ఎండలో కన్నీరు పెట్టుకుందా మంచు

ఈ మంచుని చూస్తుంటే
ఎన్నెన్ని సార్లు జారినా మళ్ళీ మొదటికే
రావాలనిపిస్తుంది

మంచు గాజు
కరిగి ముక్కలైంది
కింద నీరు తాపీగా ప్రవహిస్తుంది

పర్వతాల్ని దున్ని చాళ్ళల్లో
మంచు విత్తులు చల్లుతున్నారెవరో

మొక్కల్లో మొక్కల్లా
కొండల్లో కోనల్లా
పిట్టల్లో పిలుపుల్లా
మలుపుల్లో తలపుల్లా
పసుపూ ఎరుపూ తెలుపూ
రంగురంగు పువ్వుల్లా మేం

ఎంతో దూరం
ప్రయాణించి వొచ్చారా తల్లుల్లారా
కాసేపు సేదదీర్చుకోండి అంటూ
కొండ గుహ అక్కున చేర్చుకుంది

వెల్లకిలా పడుకుంటే
నాకిందుగా
ఆకాశం ప్రవహిస్తుంది

స్వేచ్చాలోయల్లోకి
ప్రకృతి అంతరంగంలోనికి
ప్రయాణించిన మనిషి
తన నగ్న దృశ్యాలను చూసి
తానే నవ్వుకుంటున్నాడు

నిరామయ నిశ్శబ్దంలో నుండి
ఓ పక్షి కీచుమని
అరుచుకుంటూ
వెళ్ళి పోయింది
దాని వెనుకే నామనసూ నేనూ
ఎగిరెళ్ళి పోయాము

ఉన్నట్టుండి ఓ మేఘం
హఠాత్తుగా కొండ శిఖరంపై
మొలకెత్తి మహా వృక్షంగా మారిపోయింది

వొఠ్ఠి మట్టి కొండలే
ఒక్కోసారి వెండికొండలు
సూర్యుని సమక్షంలో బంగారు కొండలు

ఉన్నట్టుండి ఓ మేఘం
హఠాత్తుగా కొండ శిఖరంపై
మొలకెత్తి
మహా వృక్షంగా మారి పోయింది

పైన మేము
మా పాదాల కింద మేఘాల మాలలు
ఒకదానినొకటి నెట్టుకుంటూ
దొర్లుకుంటూ సాగుతున్నాయి

పర్వతాలపై మంచు కురిసింది
చుట్టూ ఎన్ని కైలాసగిరులు
సాక్షాత్కరించాయో

వర్షం వెలిసింది
మబ్బులన్నీ కరిగి పోయాయి
ఓ మబ్బు తునక
పర్వత పాదాల వద్ద ఇరుక్కు పోయింది
ఇంకో దూది పింజ
కొండ కొమ్మంచు నుండి దూకి
లోయలో కలిసి పోయింది

పైన వెండి మేఘాలు
గాలిలో తేలిపోతూ
పులులూ సింహాలూ
రామచిలుకలూ గోరువంకలూ

కొండలూ కోనలూ జలపాతాలూ
క్షణాక్షణానికీ
పక్షుల్లా ఎగిరెగిరి పోతున్నాయి

వర్షం కురుస్తుంది
రెప్పపాటులో మంచు పడుతుంది
ఆపైన వాన వెలుస్తుంది
ఏమరుపాటులో ఎండ కాస్తుంది

ముందుకు సాగుతుంటే
చెట్టుచెట్టూ కూడ బలుక్కుని
చేతులెత్తి
వీడ్కోలు చెపుతున్నాయి

ఎన్నెన్ని సెలయేళ్ళివి
ఎంతెంత పురాతన నెమళ్ళివి
కొండలపై నుండి కోనలపై నుండి
దుముకుతూ దుముకుతూ
హడావిడిగా లోయల్లోకి పాముల్లాగా
పాకిపోతున్నాయి

చిన్న పిల్లాళ్ళు
ఈతలు నేర్చుకుంటున్నట్టు
ఎక్కడో ఉన్న ప్రియురాలికై
పరుగులు పెడుతున్నట్టు
దూరాన్నున్న స్నేహితుని
కలవడానికన్నట్టు
తడిసి ముద్దయిన వొంటిని
ఆరబెట్టుకుంటున్నట్టు
తెల్లని వొరి పిండిని ఆరబోసినట్టు
గలగలల ఈ సెలయేళ్ళు

A snow world










21 జులై, 2010

ఊళ్ళొదిలి పెట్టడమంటే..

ఉన్న పళంగా ఊర్లొదిలిపెట్టడం
తెలియని ఏతీరానికో కసిగా విసిరికొట్టడం
ఏగువ్వకైనా గుండె దడే
ఊపిరితో నిండిన బతుకు గూడు వదలడం
కని పెంచి పెద్ద జేసిన ఊరి అడుగు జాడల్నొదలడం
రెక్కల పక్షికైనా చావు జాడే

రాత్రిళ్ళ నిండా ఉదయాల్ని కలగంటూ
పగళ్ళనిండా వెలుతురు సెమ్మెలు వెలిగిస్తూ
పెరడునంతా అల్లుకు పోయిన మల్లె తీగ
పుటుక్కున తెగి పందిరి జారడం
పాదికైనా ఎడారిలో వల్లకాడు జాడే

తడి స్పర్శల్నిండా
కమ్ముకున్న ఆత్మీయతల్ని
ఆత్మీయతల చుట్టూ పొలి తిరిగిన
ఊసుల్నీ ఊహల్నీ
ఊడ బెరుక్కురావడం పోగొట్టుకున్న పొలాన్ని
వెనక్కెనక్కి తిరిగి చూస్తూ
పొలిమేరలు దాటడమే

మట్టిని అంటిన నీడల్నొదిలి పెట్టడం
నీడలకంటిన పురిటి జాడల్నొదిలి పెట్టడం
ఎవరో ఆగంతకులు పైకెక్కి విరగ్గాసిన చెట్టునుండి
పండిన కాయల్ని కిందకు దించడమే
పాది నుంచి మొదల్ని
కర్కశంగా తుంచి పారేయడమే
ఆకాశాన్ని భుజానేసుకుని
దిక్కూమొక్కు తెలియని దారి పట్టడమే

తరతరాలుగా పాతేసుకున్న జ్ఞాపకాల్ని
వేళ్ళతో సహా తెగబీక్కొని
గంపెడు భారాన్ని నెత్తిపై వేసుకుని
దారీ తెన్నూ తెలియని దారి పట్టడం
దారుల్నిండా నరాలుతెగే ఉత్కంఠ భరించడం
గుండెల్నిండిన ఊసుల్ని తెంపుకోవడమే
పఛ్ఛని భవిష్యత్తు నిండా ముళ్ళ కంప దించడమే

పీడకలల్ని వెంటేసుకు పోవడం
గతం పేనిన బంగారు తాళ్ళని
కళ్ళనుంచి తెంచడం
ప్రశాంత సాగరంలో కల్లోలం రేపడమే

ఊరొదిలిపెట్టడం ఊర్లో ఇళ్లొదిలి పెట్టడం
పూర్వీకుల జ్ఞాపకాల్ని తెగనరుక్కు రావడం
తరతరాలుగా వాసనలు పీల్చిన
మట్టి తల్లి నొదలడం
నలుదిక్కులా నడయాడిన అడుగు జాడల్ని
చెరిపేసి పోవడం
ప్రాణాల్నిక్కడ వొదిలేసి
కట్టెను తోడు తెచ్చుకోవడమే
ఊరొదిలిపెట్టడమంటే
ఊపిరొదిలిపెట్టడమే
(ఎందరో సామాన్యుల్ని నిర్వాసితుల్ని చేస్తున్న ప్రభుత్వాల దమనకాండకు నిరసనగా)


14 జులై, 2010

వారధి రచయితల సహకార వేదిక ఏర్పాటు ఒక సామాజిక బాధ్యత

వారధి రచయితల సహకార వేదిక ఏర్పాటు సాదా సీదాగా అతి కొద్ది మందితో జరిగినా ఈ వేదిక ఆవిర్భావంలో ఒక ఉన్నత మైన ఆశయం చోటు చేసుకుని ఉంది.రచయితలంతా కలిసి కథలు ప్రచురణ చేసుకుని ,పంపిణీ చేసుకుని పేరు ప్రతిష్టలు పెంపొందించుకుని, మేమూ రచయితలమే అని చాటింపు వేసుకోవడానికి మాత్రమే ఈ వేదిక పరిమితమైంది కాదు.ఎందరెందరో రచయితలు ,సామాజిక కార్యకర్తలు బాధ్యతలు మరిచి సౌకర్యాల కోసమే ఆరాటపడుతున్నఈసందర్భంలో మేము మా బాధ్యతగా ఈవేదికను ఏర్పాటు చేశాం.ఐతే మొదటి అడుగుగా వేసిన నవతరం తెలుగు కథ సందర్భంలో మా ప్రయత్నాన్ని కొందరు సహృదయులు అర్థం చేసుకున్నారు.ఇంకొందరు అపార్థం చేసుకున్నారు.

ఇవాల్టి సామాజిక సందర్భం అత్యంత సంక్లిష్ట మైనది .అత్యంత విషాద భరితమైనది.అంతా బాగానే ఉంది. కానీ ఎందుకింత అశాంతి చోటు చేసుకుంటున్నది మనిషికి లోపలా బయటా. ఎవరికి ఎవరూ కాకుండా ఎందుకు పోతున్నారు.ఒకే కప్పు కింద ఉంటూ కూడా ఒంటరి బ్రతుకులు ఎందుకు బ్రతుక వలసి వస్తుంది.ఏమిటీ మాయల మరాఠీలు సృష్టించే మాయాజాలం? ఈ సందర్భమే ,ఈ ప్రశ్నలే మా అడుగు ముందుకు వెయ్యడానికి మమ్మల్ని పురికొల్పింది. చాలా మంది అనుకుంటున్నట్టుగా ఇది ఎవరికీ పోటీ కాదు.ఏ వొక్కరూ నిర్వహించేదీ కాదు.వ్యక్తిగతమైంది అంతకంటే కాదు.సామూహికంగా రచయితలు కలవడానికీ,విభిన్నమైన అభిప్రాయాలు చర్చించుకోవడానికి,ఉన్నతమైన రచనలు చెయ్యడానికీ,ప్రచురించు కోవడానికీ, రచయితలలోనూ,పాఠకులలలోనూ సమాజం పట్ల ఆలోచనా,అవగాహనా పెంపొందించుకునే దిశగా పయనించాలనేది మా అభిమతం. నలుమూలలా ఉన్న పాఠకులను చేరడానికి, వీలైనంత తక్కువ ఖర్చుకే సాహిత్యాన్ని అందించడానికి ఏర్పాటు చేసుకున్న విశాలమైన వేదికే ఇది.

ఈ వేదిక నుండి ఏటా ఒక్క సంకలనము మాత్రమే ప్రచురించ బడదు..అన్ని వాదాలు ,సిద్ధాంతాలను అంగీకరిస్తూనే అవసరమైన చర్చలు జరుపుతూనే వేదిక విస్తరించాలనేది మా అభిప్రాయం. రచయితల సంఖ్య వేదికలో పెరిగే కొద్దీ ,రచయితలు వేదికలో చేరే కొద్దీ సంకలనాల సంఖ్య కూడా విస్తరిస్తూ పోవాలన్నదే మాసంకల్పం.ఈ వేదికలో చేరడానికి ఇంతకు ముందులాగా ఎలాంటి నియమ నిబందనలు లేవు.మంచి రచనలు చేయగలగడము,కలిసి పని చెయ్యడమే అందరికీ కావలసింది.ఈ విధంగా ముందుకు నడుస్తూ నడుస్తూ సాహిత్యంలో సహకార వ్యవస్థను ఏర్పాటు చెయ్యాలన్నదే మా ఆశ.

నవతరం తెలుగు కథ వచ్చి సంవత్సరము దాటినప్పటికి తదుపరి సంకలనం కొంత ఆలస్యమైన మాట వాస్తవమే.ఈఆలశ్యానికి పెద్దగా చెప్పుకోదగ్గ కారణాలేమీ లేవు .ఒక కూడలిలో మొదలైన ప్రయాణం బలం పుంజుకుని వేగవంతం కావడానికి,విస్తృతం కావడానికి,ఉత్సాహము రెట్టింపు కావడానికే ఈ విరామం.ఒక కథతో మొదలైన ఈ ప్రయత్నం అనేక కథలుగా కవిత్వంగా,అనువాదాలుగా అనేక సాహిత్య ప్రక్రియల సమాహారంగా ఎదగడానికే మరింత మాఈ నిదానం.

13 జులై, 2010

లోయలు కొండలు జలపాతాలు






ఎన్నెన్ని కొండలో జంటలు జంటలుగా
చేతుల్చేతులు పట్టుకుని
ఎన్నేళ్ళ నుంచో ధైర్యంగా నిలబడి ఉన్నాయి

కొండలపై అక్కడక్కడా
గోధుమ పంట
పర్వతాల తలపై పాపిట తీసినట్టు

పర్వతాలు వళ్ళు విరుచుకుని
పవ్వళించాయనుకుంటే
హఠాత్తుగామంచు వర్షం
తెల్లని పాలపాట పాడింది

పర్వతాలు
చీకట్లో మునిగి పోతున్నాయని
సూర్యుడు ఒక వెలుతురు తునకను విసిరేడు
భళ్ళున తెల్లారిపోయింది

చిక్కటి చీకట్లో చెట్ల వరుసలు
వాటి మధ్య
వెలుతురు తుంపులు తుంపులుగా
రాలి పడుతుంది

ఆ కొండ చరియలపై
శిల్పులు చెక్కని
అపురూపమైన శిల్పాలెన్నో

పర్వత పాదాల ముందు
మోకరిల్లి అనుకునే వాడిని
ఆ కొండలు ఆకాశాన్నంటుతున్నాయని
ఇప్పుడా కొండలు ఓడిపోయి
నా పాదాలకు నమస్కారం చేస్తున్నాయి

మా ఇంటి ముంగిట మందారం చెట్లు
ఒళ్ళంతాఎర్రెర్రని కళ్ళయి మురిపించేయి
ఇన్నిన్ని పూవనాల మధ్య నోట మాటే రావడంలేదు

మనం మౌనంగా నడుస్తుంటే
ప్రకృతి మాట్లాడుతుంది
చెట్లు వంగి నమస్కారం చేస్తాయి
జలపాతాలు గలగలా నవ్వుతాయి
కొండలు గుండెలకు ధైర్యాన్నిస్తాయి
సాగిపోతున్న బాటసారులకు సెలయేళ్ళు
వీడ్కోలు చెబుతాయి

నేనిక్కడ ప్రకృతిని పూటుగా తాగాను
కోయిల్లా పాడ్డం మొదలు పెట్టాను

ఎంతో నేర్చుకున్న మేధావినని
ఇంత కాలం విర్ర వీగాను
తల్లీ నీదగ్గరకొచ్చాక తెలిసింది
నేనొక నిరక్షరాశ్యుడనని

ఎవరెవరు చెక్కారీ శిల్పాలను
ఎన్నెన్నో వగలు పోతున్నాయివి

ఈ మంచు బిందువుల బుగ్గల్తో
ఆ సూర్యకిరణాల పెదాలు
దోబూచులాడుతున్నాయి

అప్పుడప్పుడా మేఘాలు
కొండల అంచుల్ని
ముట్టుకుంటున్నాయా
ముద్దెట్టుకుంటున్నాయా