21 జులై, 2010

ఊళ్ళొదిలి పెట్టడమంటే..

ఉన్న పళంగా ఊర్లొదిలిపెట్టడం
తెలియని ఏతీరానికో కసిగా విసిరికొట్టడం
ఏగువ్వకైనా గుండె దడే
ఊపిరితో నిండిన బతుకు గూడు వదలడం
కని పెంచి పెద్ద జేసిన ఊరి అడుగు జాడల్నొదలడం
రెక్కల పక్షికైనా చావు జాడే

రాత్రిళ్ళ నిండా ఉదయాల్ని కలగంటూ
పగళ్ళనిండా వెలుతురు సెమ్మెలు వెలిగిస్తూ
పెరడునంతా అల్లుకు పోయిన మల్లె తీగ
పుటుక్కున తెగి పందిరి జారడం
పాదికైనా ఎడారిలో వల్లకాడు జాడే

తడి స్పర్శల్నిండా
కమ్ముకున్న ఆత్మీయతల్ని
ఆత్మీయతల చుట్టూ పొలి తిరిగిన
ఊసుల్నీ ఊహల్నీ
ఊడ బెరుక్కురావడం పోగొట్టుకున్న పొలాన్ని
వెనక్కెనక్కి తిరిగి చూస్తూ
పొలిమేరలు దాటడమే

మట్టిని అంటిన నీడల్నొదిలి పెట్టడం
నీడలకంటిన పురిటి జాడల్నొదిలి పెట్టడం
ఎవరో ఆగంతకులు పైకెక్కి విరగ్గాసిన చెట్టునుండి
పండిన కాయల్ని కిందకు దించడమే
పాది నుంచి మొదల్ని
కర్కశంగా తుంచి పారేయడమే
ఆకాశాన్ని భుజానేసుకుని
దిక్కూమొక్కు తెలియని దారి పట్టడమే

తరతరాలుగా పాతేసుకున్న జ్ఞాపకాల్ని
వేళ్ళతో సహా తెగబీక్కొని
గంపెడు భారాన్ని నెత్తిపై వేసుకుని
దారీ తెన్నూ తెలియని దారి పట్టడం
దారుల్నిండా నరాలుతెగే ఉత్కంఠ భరించడం
గుండెల్నిండిన ఊసుల్ని తెంపుకోవడమే
పఛ్ఛని భవిష్యత్తు నిండా ముళ్ళ కంప దించడమే

పీడకలల్ని వెంటేసుకు పోవడం
గతం పేనిన బంగారు తాళ్ళని
కళ్ళనుంచి తెంచడం
ప్రశాంత సాగరంలో కల్లోలం రేపడమే

ఊరొదిలిపెట్టడం ఊర్లో ఇళ్లొదిలి పెట్టడం
పూర్వీకుల జ్ఞాపకాల్ని తెగనరుక్కు రావడం
తరతరాలుగా వాసనలు పీల్చిన
మట్టి తల్లి నొదలడం
నలుదిక్కులా నడయాడిన అడుగు జాడల్ని
చెరిపేసి పోవడం
ప్రాణాల్నిక్కడ వొదిలేసి
కట్టెను తోడు తెచ్చుకోవడమే
ఊరొదిలిపెట్టడమంటే
ఊపిరొదిలిపెట్టడమే
(ఎందరో సామాన్యుల్ని నిర్వాసితుల్ని చేస్తున్న ప్రభుత్వాల దమనకాండకు నిరసనగా)


4 కామెంట్‌లు:

  1. సోంపేట ఘటన నేపద్యంలో ..ఆకలిని అక్రందనను అక్షరాలతో చెప్పుకున్నారు... రాయాలి. ఇంకా కోపంగా ..
    శ్రిచమన్

    రిప్లయితొలగించండి
  2. ఇల్లొదలడం, వూరొదలడం--కాదు--దేశాన్నే వదలడం--ఇలాంటివి రెడ్ ఇండియన్లకీ, ఆఫ్రికన్లకీ, ప్రపంచ యుధ్ధాల్లో దేశాలొదిలి పోయిన వాళ్ళకీ తెలిసినంతగా మనకేమి తెలుసు?

    మహాభారత యుధ్ధం తరవాత అంత పెద్ద యుధ్ధం "కళింగ యుధ్ధం" జరిగాక, అశోకుడంతటివాడు "అహింస" అనబట్టి, మనకి పెద్ద పెద్ద యుధ్ధాలూ, వూళ్ళూ దేశాలూ వదిలి పోయే దుస్థితి రాలేదు. అందుకు బ్రిటిష్ వాళ్ళకీ, గాంధీగారికీ కృతఙ్ఞులమై వుండాలి!

    మీ కవిత బాగుంది--ప్రయత్నం ఇంకా బాగుంది.

    కీపిటప్!

    రిప్లయితొలగించండి
  3. మంచికంటి గారూ:

    ఈ కవిత బాగుంది. అవును, "ఊరొదిలి పెట్టడం అంటే/ వూపిరి వదిలి రావడమే"

    కాని, వలస అనివార్యమైన దశ ఇది. ఆ అనివార్యతని చెప్పే కవిత్వమూ కావాలేమో!

    అఫ్సర్
    www.afsartelugu.blogspot.com

    రిప్లయితొలగించండి