27 జన, 2019

దేవుడెప్పుడూ అదృశ్యమైపోడు

దేవుడెప్పుడూ అదృశ్యమైపోడు
 దేవుడు అనంతలోకాలకు సాగిపోతాడు    
పోతూ పోతూ తమ ప్రతినిధుల్నిభూమ్మీద వదలి వెళ్తాడు
దేవుడెప్పుడూ మనుషుల్లో మమేకమై ఉంటాడు
పిల్లల్లో కొలువుదీరి వెలుగుపూలు పూయిస్తాడు
తన కిరణాల వెలుగుల్తో ప్రకృతికంతా పచ్చదనాన్ని పంచుతాడు
దేవుడెప్పుడూ మంచి మనుషుల మనసుల్లో కొలువై ఉంటాడు
 ఆయన మూగజీవులకు మాటలిస్తాడు  పక్షులకు రెక్కలిస్తాడు
పూలకు సువాసనలిస్తాడు
మనుషులకు సుగుణాలిస్తాడు

తాను వెళ్ళిపోతూ దశ దిశలా వెలుగుల్ని విరజిమ్ముతూ భువి నుండి దివికేగుతాడు
తనకు మారుగా ఎందరో భగవత్ స్వరూపులను ఇక్కడ సృష్టించి వెళతాడు
దేవుడెప్పుడూ మంచి మనుషుల్లో కొలువై వుంటాడు
వాళ్ళ మనసుల నిండా మానవత్వం నింపి వెళతాడు
కొంత మంది త్యాగజీవుల్ని దేవదూతలుగా పంపి తాను విశ్రాంతి మందిరానికి వెళతాడు
నిజమైన దేవుడెప్పుడూ మంచి మనసుల నిండా కొలువై వుంటాడు 

శాంతి వనాలు

శాంతి వనాలు
----------
జవాబు లేని పశ్న కదా
జీవితం

స్వజనం పరజనం
అంతా ఒక కల్పన
నీకు నువ్వు కూడా కాదు

ధ్యానం
ఒక సంసిద్ధత

అయిపోయిందనుకునే
ప్రతిసారీ
మళ్ళీ మొదలవుతూనే వుంది

ఏం తేలుసుకున్నాం
జీవితసారం
అలల్లా ఎగిసేగిసి పడుతున్నాం

మబ్బులు ముసిరాయి
విడిపోతాయి
సిద్దంగా ఉండాలి

నలుగురికీ చేప్పేది
నైపుణ్యమే
ఆత్మ సంగతో మరి

ఈ కాసినీ అక్షరాలను
 దోసిట్లోకి వొంపి
మౌనంగా వేళ్లిపోయాడాయన

ఈ అర్ధరాత్రి
కోడి కూతే
తోడు నాకు

సాగి పోయినా కాలం కాదు
అడుగుజాడలేమైనా
మిగిలున్నాయా

మనిషే సృష్టించుకున్నాడు
మనిషినే
మింగేస్తున్నాయి










ఇప్పుడు మనుషులు మాట్లాడే మాటలు కావాలి

ఇప్పుడు మనుషులు మాట్లాడే మాటలు కావాలి
😋😋😋😋😋😋
ఇప్పుడు మాటలు మాటలు గా వెల్లువెత్తే మనుషులు కావాలి

మంచి ముత్యాలు జల్లులుగా కురిసే
మాటల మమతలు కావాలి

పెదాల అంచుల్లో పూసే సుగంధ పరిమళాలు కావాలి
గాలి సయ్యాటల్లో తేలియాడే
పరిమళాలు వెదజల్లే పూదోటలు కావాలి

ఆప్యాయంగా పలకరించే
హృదయపు ఆలింగనాలు కావాలి

అశాంతి వెల్లువై పారే మనుషుల వృక్షాల
కొమ్మ కొమ్మనూ వంచే
తేటతేట తేనె పలుకులు మల్లెలుగా కురవాలి

కన్నుల సందిట పూసే సరిగమలు  సిరిమువ్వల గజ్జెలుగా రాలాలి
కాలాన్ని  కావ్యం చేసి నవ్వించే మాటలు పాటలు కావాలి

మానవ స్పర్శలు పెంచే హృదయ వీణియలు మీటే
గట్టిమాటలు మూటలు గట్టే  మనుషులు కావాలి

వెల్లువల్లో కొట్టుకు పోయే మనుషుల్ని ఆపి కూర్చోబెట్టి
సేదతీర్చే మాటల లేపనాలు కావాలి
అవి ప్రసరించే ఎల్లలు లేని ఆనందాలు కావాలి

మనిషి మనిషిగా మారే మాటలు జల్లులుగా  రాలాలి మనిషి మనిషిగా ఆనందంగా పక్షుల్లా ఎగరాలి
       - శాంతివనం  మంచికంటి

సౌందర్య పిపాసి


సౌందర్య పిపాసి

నుదిటిన విభూతి ధరించి వచ్చాడతడు
మూసిన కన్నుల్ని విప్పకుండానే
నిద్రవోతున్నతల్లి  మనసుని తట్టి లేపాడు

పంట చేలో పైరగాలి వీచినట్టుగా
సుతిమెత్తని ఉన్ని చేస్పర్శతో
అద్దుతూ అద్దుతూ
అనంత లోకాలకు తీసుకు వెళ్ళాడు

కత్తి నిండా పూల వనాన్ని చుట్టి
చర్మానికి సుగంధ లేపనం అద్దినట్టు
అద్దుతూ అద్దుతూ మాటల వనంలోకి మౌనంగా  నడిపించుకు వెళ్ళాడు

ముఖం నిండా పన్నీటి జల్లును తొలకరి చినుకుల్లా చిమ్మి
సుగంధ లేపన పరిమళ మద్దాడతను
ఆ చేస్పర్శతో  మౌనంలోని నవ నాడులు మేల్కొల్పి  ఏవో లోకాలకు రథంపై ఊరేగింపుతో తీసుకు వెళ్ళాడు

అపూర్వమైన చిత్రకళాకారుడులా
పని తనానికి మెరుగులు దిద్దుతున్నట్టుగా
అతను కత్తితో చర్మంపై
చిత్రలేఖనాన్ని  లిఖిస్తున్నట్టు
రాతిపై ఉలితో శిల్పాలు చెక్కుతున్నట్టు    కళా తృష్ణ తీర్చుకుంటున్నాడు

కళ్ళలో ఏవో వెలుగుల్ని పూయించాలని చర్మానికి తళుకులద్దే పని అతి నేర్పుగా చేసుకుపోతున్నాడు

నిద్రపోతున్న హృదయ వనానికి
మెలకువ తెలీకుండా గుసగుసగా కత్తితో
వెనుకా ముందుకూ  కదులుతున్నాడు

పూల స్పర్శ తోనే తలను అటూ ఇటూ
కదిలీ కదలనట్టు
నెమ్మదిగా మరింత నెమ్మదిగా
మూసిన కన్నులు మూసినట్టుగానే
ఒక దేవతార్చనలో నిమగ్నమైనట్టు
పూజా సామగ్రిని అమర్చినట్టు  అగరువత్తులను 
హారతి కర్పూరం వెలిగించినట్టుగా
నైవేద్యం సమర్పించినంత ధ్యానంతో ధ్యాసతో

 చేయి చేసే సైగలతోనే మోము అందాలకు పుప్పొడులు తెచ్చి అద్దుతూ అద్దుతూ
ఒక మైకంలోకి
ఒక మధుర స్వప్నంలోకి
 ఒక పురాభావంలోకి       
 ఒక పూపోదరింట్లోకి       
ఒక వెన్నెల వర్షంలోకి
నా బాల్యంలోకి
లాక్కెళ్ళి పోతున్నాడీ క్షురకుడు
- శాంతివనం manchikanti

5 మార్చి, 2017

మాట్లాడుతున్నామా

మనం నిండు మనసుతో హాయిగా చల్లని పిల్ల తెమ్మెర వీచినట్లు మాట్లాడుతున్నామా

నేను నీతో నువ్వు నాతో
మనం మనతో మాట్లాడుతున్నామా
పక్క వారి కోసం కాకున్నా
మన కోసమైనా మాటల తోటల్లో విహరిస్తున్నామా

తల్లులు పిల్లలతో పిల్లలు తండ్రులతో మాట్లాడుతున్నామా
మాటలు మనిషిని ఆత్మీయంగా
 దగ్గరకు తీసుకుని
మనసును పన్నీటి జల్లులో సేదతీరుస్తాయి
ఎన్నెన్నో పురాగాయాలకు లేపనాలు పూస్తాయి

మాట్లాడుతున్నామా పూలతో నేలతో గాలితో
మాట్లాడుతున్నామా
మాటల తటాకం నుండి చల్లని గాలిని వీస్తున్నామా
మాటల తీవెల వెంట ఒకరినొకరం అల్లుకుంటున్నామా
హృదయం చాటునుండి కారే కన్నీటిని
చెక్కిళ్ళపై నుండి తుడిచే చల్లని ఓదార్పుతో మాట్లాడుకుంటున్నామా

జీవితాలని సేదతీర్చే  పూలజల్లులు వాళ్ళు  స్వర్గలోకాల నుండి
 దిగి వచ్చే  ఆ చిన్నారి పొన్నారులతో మాటా మాటా కలిపి వుయ్యాల జంపాల
వూగు తున్నామా

మాటల పూదోట గా మారి చేయి పట్టి అలా
నడిపించుకు వెళ్ళే మాటలేమైనా మనలో మిగిలున్నాయా
ఆప్యాయంగా తలలూపే హొయలుపోయే
మాటలేమైనా మిగిలున్నాయా

మనతో మనం మాటలతో మనం మౌనంతో మనం మన వాళ్ళతో మనం మాట్లాడే మాటలేమైనా మిగిలున్నాయా
మన ఆత్మలతో మనం అంతరంగంతో మనం
 మన అనుభవాలతో  అనుభూతులతో మనం  మాట్లాడుతున్నామా

మాటలుండీ మూగ వాళ్ళమయ్యాం చూడండి మనం
    -  శాంతివనం మంచికంటి

16 జూన్, 2013

పిల్లికి బిచ్చం పెట్టరు
గొంతు ఎండి పోయే వాడికి
గుక్కెడు నీళ్ళు పోయ్యరు
పక్క మనిషి చావు బతుకుల్లో వున్నా
కన్నెత్తి కూడా చూడరు
విరిగిన వేలుపై వుట్టి పుణ్యానికి
ఓంటేలైనా పోయ్యరు
పచ్చి నెత్తుర్లు తాగడానికి
కత్తులనైనా కౌగలించు కుంటారు
కొన్ని సారా పేకెట్ల కే జీవితాల్ని బలి తీసుకుంటారు
నమ్మిన వాడి మూలుగుల్నించి
రక్తాన్ని జలగల్లా పీల్చుకుంటారు
క్రికెట్ మార్కేట్టాట కొట్లాటలో
ఒకే ఒక్క విజయానికే
వీరంగాలు వేస్తారు
టపాకాయలు కాలుస్తారు
మిఠాయిలు పంచుతారు
తాగి తమ్దనాలాడతారు
జెండాలతో చిందులు వేస్తారు
నానా రకాల నజరానాలు ప్రకటిస్తారు
వహ్వా దేశభక్తి జిందాబాద్

పసికూనకు బోసినవ్వే కరువైపోయింది


పసికూనకు బోసినవ్వే కరువైపోయింది

కన్నులు మూసే పిల్లల కన్నీళ్ళ వెనుక
ఏ బాధల గాధలున్నాయో కాస్త కళ్ళు విప్పి చూద్దామా
అసువులు బాసే అందాల బొమ్మల ఆత్మలతోనైనా మాట్లాడేద్దామా
అనగనగా కథలు విన్న సాంస్కృతిక రాజ్యంలో   
పసికూనకు బోసినవ్వే కరువైపోయింది
పుట్టిన పాపకు నడకలు నేర్పకపోయినా పరవాలేదు
వుగ్గుపాలతో పరభాషను నూరిపోసేంత
నరకంలోకి జారిపోయామిప్పుడు
పిల్లల భవిష్యత్తు కలల పెరట్లోకి ఎన్నెన్నో నరకాలు
అడుగులు వేసుకుంటూ వచ్చేశాయి 
సంస్కృతి తెలియదు భాషలేదు
నోటమాటెలా వస్తుంది
మనసుపొరల్లో ప్రేమలెలా విచ్చుకుంటాయి
పరాయి భాషా నూరిపోతలో
బ్రతికి వున్నదీ తెలియదు
ప్రాణం పోయేదీ తెలియదు
చల్లని గాలుల ఆస్వాదనలేమిటి
పచ్చటి సాయంత్రాల కేరింతలెక్కడ
మనిషిమనిషినీ కలిపి కుట్టే
ఆత్మీయాను బంధాలకు తావెక్కడ
సుడులు తిరిగే దుఖ్ఖపు హోరులో
ఎవరు ఎవరికి ఏమౌతారొ
బతుకు పోరులో ఎవరికి ఎందుకు ఖైదీలయ్యారో
తెలియని యుద్ధంలో  రాటుదేలిన యంత్రాలు వీళ్ళు

మంచికంటీ శాంతివనం 

17 నవం, 2011

ఒంగోల్లో రాష్ట్ర స్థాయి కథా సదస్సు

ఒంగోల్లో రాష్ట్ర స్థాయి కథా సదస్సు
వేదిక; హోటల్ మౌర్య కాంఫరెన్స్ హాల్ ,ఒంగోలు
తేదీ; నవంబర్ 26,27 శని ఆదివారాలు
రాంకీ ఫౌండేషన్ సౌజన్యం తో శాంతివనం-వారధి సంయుక్త ఆధ్వర్యంలో ఒంగోల్లో కథా సదస్సు మరియు వర్క్ షాప్ జరుగును.ఈ సదస్సులో తెలుగు కథ పూర్వాపరాలు,
కథా వస్తువు -శిల్పం నిరంతర పరిణామం
పిల్లలు యువతలో కథా సాహిత్య వ్యాప్తి
వివిధ దేశాల మంచి కథల పరిచయం
తెలుగు భాష-ప్రస్తుత పరిస్థితి
ప్రపంచీకరణ అనంతర పరిణామాలు
అనువాద కథ రాస్ట్రేతర రచయితలతో సంభాషణ
వివిధ ప్రాంతాల కథా విస్తరణ పై చర్చ జరుగును ఇంకా నూతన కథా సంకలనాలు పరిచయం జరుగును.
ఈ సదస్సులో కె. శ్రీనివాస్ ,పాపినేని శివశంకర్ ,ముకుంద రామారావు,బి.ఎస్.రాములు,నల్లూరి రుక్మిణి,ఏ.కే ప్రభాకర్,విహారి,పరవస్తు లోకేస్వర్,పెద్దింటి అశోక్ కుమార్,రామా చంద్ర మౌళి ,వి. చంద్ర శేఖర్రావు ,వాసిరెడ్డి నవీన్,ఏ.యన్.జగన్నాధ శర్మ,సా.వెం.రమేష్ ,కే.యన్ మల్లేస్వరి,పెనుగొండ లక్ష్మీనారాయణ,పూడిరి రాజిరెడ్డి,యంవీ రామిరెడ్డి వి.ప్రతిమ,హెచ్చార్కె ,తుమ్మేటి రఘోత్తం రెడ్డి,ఆరెం వుమామహేశ్వర్ రావు,,చింతపట్ల సుదర్శన్,రఘునాధ-కర్ణాటక ,వెంకట క్రిష్ణ ,పలమనేరు బాలాజీ,బా రహంతుల్లా,జీ వుమామహేశ్వర్,దగ్గుమాటి పద్మాకర్,జిల్లేళ్ళ బాలాజీ,అజయ్ ప్రసాద్,సుంకోజీ దేవేంద్రా చారి,
మరియు ప్రకాశం జిల్లా రచయితలు అందరూ పాల్గొంటారు.
వేదిక హోటల్ మౌర్య కాంఫరెన్స్ హాల్ ,ఒంగోలు
తేదీ 26,27 నవంబర్ 26,27 శని ఆదివారాలు

8 నవం, 2011

అజయ్ ప్రసాద్ కథల గురించి

ఏ నక్షత్రం లో పుట్టేడో కానీ కథల్ని సొంతంగా చూసింది చూసినట్టురాస్తున్నాడు అజయ్ ప్రసాద్ మృగశిర అయినా చిత్త కార్తె అయినా వున్నదివున్నట్టురాయడం మామూలు విషయమేమీకాదు.రాయడం లో కూడా వేదాంతంరాస్తున్నట్టుగానే రాయడంఇంకా గొప్ప విషయమే .అటు బెల్లిగువ్వ ఇటు జెముడుకాకి కూడా తత్వం మాట్లాడుతున్నట్టుగానే వున్నాయి.రెండు పక్షుల మధ్యసంభాషణని కథ రూపంలోకి తేవడం ,పక్షులు మాట్లాడుతున్నవి అనే విషయంమర్చిపోయి పాఠకుడు కథలోకి పొవాలంటే వాతావరణం చాలా పకడ్బందీగా వుండాలి. అయినా మృగశిర ని కథ చేశాడు.ఆ కథ కూడా చదివే కొద్దీ ఆయువు పట్టు మీదగురి చూసి కొట్టి నట్టు వుంది. సన్యాసుల మధ్య సంభాషణలైనా,శాస్త్రవేత్తలు ఎగిరే పళ్ళాలు గురించిఅయినా మల్టీమిలియన్ కంపెనీల సియీవోలు మాట్లాడుకుంటున్నా అదేందో అక్కడేకూర్చుని వాళ్ళు మాట్లాడుకునేవి విని రాసినట్టు రాస్తాడు.ఎక్కడా ఒక్కవాక్యం తియ్యడానిక్కానీ ఎయ్యడానిక్కానీ వీలుండదు.ఒక వాక్యం చదావక పోతేఏదో పోగొట్టుకున్నట్టుగా వుంటది. కథ చదువుతూ చదువుతూ కాసేపు అలా శూన్యంలోకి చూసి కాసేపు కళ్ళుమూసుకుని ఏవో జ్ఞాపకాల్ని నెమరేసుకుని మళ్ళీ కథలోకిజొరబడదామనిపిస్తుంది.ఒక కథ చదివి అలా పక్కన పెడితే ఏదో జీవన ఆంతర్యంబోధపడుతున్నాట్టూగా అనిపిస్తది.లోలోపల లోతులేవో బూడుతున్నట్టుగా వుంటది. పరుగెత్తుతున్న మనుషులు ఎందుకు పరుగెత్తుతున్నారో అర్థమై ఆ పరుగేఆపేద్దామనిపిస్తది.కదలకుండా కూర్చున్నోడికి నేనెందుకు జడ పదార్థంలాకూర్చున్నానోనని లేచి నడక సాగిద్దామనిపిస్తది. మొత్తానికి కథలంటే ఇలాంటి జీవిత సత్యాల లాగా వుండాలేమో కథలంటేకాకమ్మలు,పిచ్చుకమ్మలు చెప్పినా అచ్చమైన జీవితాల్లాగా వుండాలేమోఅనిపిస్తుంది.అజయ్ ప్రసాద్ ప్రకాశంజిల్లా కన్న బిడ్డ అయినా సాహిత్యానికిజీవితానికి ఎల్లలేమిటి.కథ కథే కథ జీవితమే కదా.

18 అక్టో, 2011

అమ్మా నువ్వీయాల బతికే వుంటే!



అమ్మా నువ్వీయాల బతికే వుంటే!

నాలుగు క్షణాల వెచ్చని ధార కోసం
కాట్లాడుకునే ఈ సంక్షోభ క్షణాల్లో
అమ్మా నువ్వే గనక బతికే వుంటే
ఆకలో ఆకలో యని వెక్కి వెక్కి ఏడుస్తూ ఏడుస్తూ
వెక్కిళ్ళుబెట్టేటప్పుడు
ఒడిలో పడుకోబెట్టుకుని
అంతరంగాల్లో సుళ్ళు తిరిగే కళ్ళ నీళ్ళు తుడుస్తూ
లాలి పాటలతొ చందమామ దాకా ఎగిరెళ్ళే వెన్నెల్లో
గోరుముద్దలు గొంతుజారే దాకా తినిపించే దానివి కదా

గుడ్డులోంచి వెలికొచ్చినప్పటినుండి
ఊహల పొదరిళ్ళలో
బాల్యం బంతిని చేసి తన్నక ముందే
సజీవమైన నీ నవ్వే వుంటె
వెన్నంటీ నువ్వుంటే
పాల బుగ్గల పసిడి కందులకు
పాలనురగ ఆప్యాయతలు పంచే తల్లుల
ఆత్మీయతల్ని కాస్త కస్త నంజుకుంటూ
నాతో ఆడ్డానికొచ్చే ప్రత్యర్థుల్ని
నిలువునా గుమ్మాయి దెబ్బల్లో బొంగరాలుగా
చీల్చేసే వాణ్ణే కదా

నీ ఆప్యాత నంతా కూరి కూరి
నా భుజాన బరువు సంచీ పుస్తకాల్లా వేలాడ దీసుంటే
ఆత్మన్యునత కన్నీళ్ళను గడపకివతలే
మాసిన గుడ్డల్లా విడిచేసి
ఎక్కే పొద్దులా ఎదిగి పోయే వాణ్ణి కదా

నీ ఓదార్పు మాటలు తారక మంత్రంలా నా చెవిని సోకివుంటే
ఎంతెంతో ఎత్తెదిగి చిటరుకొమ్మల్లో
మిఠాయి పొట్లాల్నీ నా సావాస గాళ్ళకి సైతం
కొమ్మొంచి దూసి పోసే వాణ్ణి కదా

నడిచిన నా బాటెంటంతా
అడుగులు నీ అర చేతులై వుంటే
సాగిపోయే మనూరి డొంకల్ని రాచబాటల్ని పోయించేది కదా
కన్నీరింకిన కన్నుల్నిండా
దొరువుల్లో దోర్చి పోసిన నీళ్ళు నింపి వుంటే
చూపు సారించినంత మేరా
సస్యశ్యామలమై పోయేది కదా

ఊహలు వుయ్యాల లూగే తరుణాన
నా కళ్ళ పాడెల మీదుగా నడిచేళ్ళి
చేతుల్నిండా కొరివి మంటల్ని మొలిపించి
దింపుదు కళ్ళాం ఆశల్ని మిగిల్చావు
ఇయ్యాల నీ ఋ ణం తీర్చుకుందామన్నా నాకీ కవిత్వం దానం చేసి
నన్నొక ఋణ గ్రస్తుణ్ణిగానే మిగిల్చి పోయావా