22 జులై, 2010

హిమాలయాలు- చివరి అంకం



గుడారాల్లో మేము
కొండలపై ఎలుగుబంట్లు
లోయల్లో చెట్లు
చెట్లపైన బుల్లిబుల్లి పిట్టలు
అడవి మనుషులం కాదా మనం

ఆ కొండంచుకు తెల్లటి దివిటీలా
చంద్రుణ్ణి
వేలాడదీసి వెళ్ళిపోయారెవరో

నక్షత్రాలన్నీమూకుమ్మడిగా
ఆకాశం నుండి దిగి వొచ్చి
మనుషుల్తో మాట్లాడుతున్నాయి
భూలోకమెలాగుందని
పలకరిస్తున్నాయి

ఆహాహా
ఇదెంత మంచు చల్లని
మెత్తని కత్తిలా కోసే
హాయి సముద్రం

ఇంద్రధనుస్సులో రంగులన్నీ తీసి
ఇక్కడే హోలీ ఆటాడుతున్నారెవరో

ఆ కొండలపై ఎంతమంది
నిర్విరామంగా శ్రమించి
ఈ తెల్లటి మంచు వెల్ల వేశారో

కొమ్మలు తలలు వంచి
ఆశీర్వదిస్తున్నాయి
సాహసికుల్లారా వెళ్ళిరండని
జీవన సారాన్ని ఆస్వాదించడానికి
వయోభేదాలు లింగ వివక్షలు
భాషాభిమానాలు లేవులెమ్మని
సాగనంపుతున్నాయి

పాపం మందలో నుండి తప్పిపోయిన
గొర్రెపిల్లలా లాగుంది
ఆ ఒక్క పువ్వు
నీలం రంగులో వెలిగి పోతూ

ఒక్కో వైపు ఒక్కో రకంగా
వగలు పోతున్నాయా కొండలు

ఎంతమంది దాటుతారు నన్ను
ఎండలో కన్నీరు పెట్టుకుందా మంచు

ఈ మంచుని చూస్తుంటే
ఎన్నెన్ని సార్లు జారినా మళ్ళీ మొదటికే
రావాలనిపిస్తుంది

మంచు గాజు
కరిగి ముక్కలైంది
కింద నీరు తాపీగా ప్రవహిస్తుంది

పర్వతాల్ని దున్ని చాళ్ళల్లో
మంచు విత్తులు చల్లుతున్నారెవరో

మొక్కల్లో మొక్కల్లా
కొండల్లో కోనల్లా
పిట్టల్లో పిలుపుల్లా
మలుపుల్లో తలపుల్లా
పసుపూ ఎరుపూ తెలుపూ
రంగురంగు పువ్వుల్లా మేం

ఎంతో దూరం
ప్రయాణించి వొచ్చారా తల్లుల్లారా
కాసేపు సేదదీర్చుకోండి అంటూ
కొండ గుహ అక్కున చేర్చుకుంది

వెల్లకిలా పడుకుంటే
నాకిందుగా
ఆకాశం ప్రవహిస్తుంది

స్వేచ్చాలోయల్లోకి
ప్రకృతి అంతరంగంలోనికి
ప్రయాణించిన మనిషి
తన నగ్న దృశ్యాలను చూసి
తానే నవ్వుకుంటున్నాడు

నిరామయ నిశ్శబ్దంలో నుండి
ఓ పక్షి కీచుమని
అరుచుకుంటూ
వెళ్ళి పోయింది
దాని వెనుకే నామనసూ నేనూ
ఎగిరెళ్ళి పోయాము

ఉన్నట్టుండి ఓ మేఘం
హఠాత్తుగా కొండ శిఖరంపై
మొలకెత్తి మహా వృక్షంగా మారిపోయింది

వొఠ్ఠి మట్టి కొండలే
ఒక్కోసారి వెండికొండలు
సూర్యుని సమక్షంలో బంగారు కొండలు

ఉన్నట్టుండి ఓ మేఘం
హఠాత్తుగా కొండ శిఖరంపై
మొలకెత్తి
మహా వృక్షంగా మారి పోయింది

పైన మేము
మా పాదాల కింద మేఘాల మాలలు
ఒకదానినొకటి నెట్టుకుంటూ
దొర్లుకుంటూ సాగుతున్నాయి

పర్వతాలపై మంచు కురిసింది
చుట్టూ ఎన్ని కైలాసగిరులు
సాక్షాత్కరించాయో

వర్షం వెలిసింది
మబ్బులన్నీ కరిగి పోయాయి
ఓ మబ్బు తునక
పర్వత పాదాల వద్ద ఇరుక్కు పోయింది
ఇంకో దూది పింజ
కొండ కొమ్మంచు నుండి దూకి
లోయలో కలిసి పోయింది

పైన వెండి మేఘాలు
గాలిలో తేలిపోతూ
పులులూ సింహాలూ
రామచిలుకలూ గోరువంకలూ

కొండలూ కోనలూ జలపాతాలూ
క్షణాక్షణానికీ
పక్షుల్లా ఎగిరెగిరి పోతున్నాయి

వర్షం కురుస్తుంది
రెప్పపాటులో మంచు పడుతుంది
ఆపైన వాన వెలుస్తుంది
ఏమరుపాటులో ఎండ కాస్తుంది

ముందుకు సాగుతుంటే
చెట్టుచెట్టూ కూడ బలుక్కుని
చేతులెత్తి
వీడ్కోలు చెపుతున్నాయి

ఎన్నెన్ని సెలయేళ్ళివి
ఎంతెంత పురాతన నెమళ్ళివి
కొండలపై నుండి కోనలపై నుండి
దుముకుతూ దుముకుతూ
హడావిడిగా లోయల్లోకి పాముల్లాగా
పాకిపోతున్నాయి

చిన్న పిల్లాళ్ళు
ఈతలు నేర్చుకుంటున్నట్టు
ఎక్కడో ఉన్న ప్రియురాలికై
పరుగులు పెడుతున్నట్టు
దూరాన్నున్న స్నేహితుని
కలవడానికన్నట్టు
తడిసి ముద్దయిన వొంటిని
ఆరబెట్టుకుంటున్నట్టు
తెల్లని వొరి పిండిని ఆరబోసినట్టు
గలగలల ఈ సెలయేళ్ళు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి