5 మార్చి, 2017

మాట్లాడుతున్నామా

మనం నిండు మనసుతో హాయిగా చల్లని పిల్ల తెమ్మెర వీచినట్లు మాట్లాడుతున్నామా

నేను నీతో నువ్వు నాతో
మనం మనతో మాట్లాడుతున్నామా
పక్క వారి కోసం కాకున్నా
మన కోసమైనా మాటల తోటల్లో విహరిస్తున్నామా

తల్లులు పిల్లలతో పిల్లలు తండ్రులతో మాట్లాడుతున్నామా
మాటలు మనిషిని ఆత్మీయంగా
 దగ్గరకు తీసుకుని
మనసును పన్నీటి జల్లులో సేదతీరుస్తాయి
ఎన్నెన్నో పురాగాయాలకు లేపనాలు పూస్తాయి

మాట్లాడుతున్నామా పూలతో నేలతో గాలితో
మాట్లాడుతున్నామా
మాటల తటాకం నుండి చల్లని గాలిని వీస్తున్నామా
మాటల తీవెల వెంట ఒకరినొకరం అల్లుకుంటున్నామా
హృదయం చాటునుండి కారే కన్నీటిని
చెక్కిళ్ళపై నుండి తుడిచే చల్లని ఓదార్పుతో మాట్లాడుకుంటున్నామా

జీవితాలని సేదతీర్చే  పూలజల్లులు వాళ్ళు  స్వర్గలోకాల నుండి
 దిగి వచ్చే  ఆ చిన్నారి పొన్నారులతో మాటా మాటా కలిపి వుయ్యాల జంపాల
వూగు తున్నామా

మాటల పూదోట గా మారి చేయి పట్టి అలా
నడిపించుకు వెళ్ళే మాటలేమైనా మనలో మిగిలున్నాయా
ఆప్యాయంగా తలలూపే హొయలుపోయే
మాటలేమైనా మిగిలున్నాయా

మనతో మనం మాటలతో మనం మౌనంతో మనం మన వాళ్ళతో మనం మాట్లాడే మాటలేమైనా మిగిలున్నాయా
మన ఆత్మలతో మనం అంతరంగంతో మనం
 మన అనుభవాలతో  అనుభూతులతో మనం  మాట్లాడుతున్నామా

మాటలుండీ మూగ వాళ్ళమయ్యాం చూడండి మనం
    -  శాంతివనం మంచికంటి

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి