27 జన, 2019

దేవుడెప్పుడూ అదృశ్యమైపోడు

దేవుడెప్పుడూ అదృశ్యమైపోడు
 దేవుడు అనంతలోకాలకు సాగిపోతాడు    
పోతూ పోతూ తమ ప్రతినిధుల్నిభూమ్మీద వదలి వెళ్తాడు
దేవుడెప్పుడూ మనుషుల్లో మమేకమై ఉంటాడు
పిల్లల్లో కొలువుదీరి వెలుగుపూలు పూయిస్తాడు
తన కిరణాల వెలుగుల్తో ప్రకృతికంతా పచ్చదనాన్ని పంచుతాడు
దేవుడెప్పుడూ మంచి మనుషుల మనసుల్లో కొలువై ఉంటాడు
 ఆయన మూగజీవులకు మాటలిస్తాడు  పక్షులకు రెక్కలిస్తాడు
పూలకు సువాసనలిస్తాడు
మనుషులకు సుగుణాలిస్తాడు

తాను వెళ్ళిపోతూ దశ దిశలా వెలుగుల్ని విరజిమ్ముతూ భువి నుండి దివికేగుతాడు
తనకు మారుగా ఎందరో భగవత్ స్వరూపులను ఇక్కడ సృష్టించి వెళతాడు
దేవుడెప్పుడూ మంచి మనుషుల్లో కొలువై వుంటాడు
వాళ్ళ మనసుల నిండా మానవత్వం నింపి వెళతాడు
కొంత మంది త్యాగజీవుల్ని దేవదూతలుగా పంపి తాను విశ్రాంతి మందిరానికి వెళతాడు
నిజమైన దేవుడెప్పుడూ మంచి మనసుల నిండా కొలువై వుంటాడు 

శాంతి వనాలు

శాంతి వనాలు
----------
జవాబు లేని పశ్న కదా
జీవితం

స్వజనం పరజనం
అంతా ఒక కల్పన
నీకు నువ్వు కూడా కాదు

ధ్యానం
ఒక సంసిద్ధత

అయిపోయిందనుకునే
ప్రతిసారీ
మళ్ళీ మొదలవుతూనే వుంది

ఏం తేలుసుకున్నాం
జీవితసారం
అలల్లా ఎగిసేగిసి పడుతున్నాం

మబ్బులు ముసిరాయి
విడిపోతాయి
సిద్దంగా ఉండాలి

నలుగురికీ చేప్పేది
నైపుణ్యమే
ఆత్మ సంగతో మరి

ఈ కాసినీ అక్షరాలను
 దోసిట్లోకి వొంపి
మౌనంగా వేళ్లిపోయాడాయన

ఈ అర్ధరాత్రి
కోడి కూతే
తోడు నాకు

సాగి పోయినా కాలం కాదు
అడుగుజాడలేమైనా
మిగిలున్నాయా

మనిషే సృష్టించుకున్నాడు
మనిషినే
మింగేస్తున్నాయి










ఇప్పుడు మనుషులు మాట్లాడే మాటలు కావాలి

ఇప్పుడు మనుషులు మాట్లాడే మాటలు కావాలి
😋😋😋😋😋😋
ఇప్పుడు మాటలు మాటలు గా వెల్లువెత్తే మనుషులు కావాలి

మంచి ముత్యాలు జల్లులుగా కురిసే
మాటల మమతలు కావాలి

పెదాల అంచుల్లో పూసే సుగంధ పరిమళాలు కావాలి
గాలి సయ్యాటల్లో తేలియాడే
పరిమళాలు వెదజల్లే పూదోటలు కావాలి

ఆప్యాయంగా పలకరించే
హృదయపు ఆలింగనాలు కావాలి

అశాంతి వెల్లువై పారే మనుషుల వృక్షాల
కొమ్మ కొమ్మనూ వంచే
తేటతేట తేనె పలుకులు మల్లెలుగా కురవాలి

కన్నుల సందిట పూసే సరిగమలు  సిరిమువ్వల గజ్జెలుగా రాలాలి
కాలాన్ని  కావ్యం చేసి నవ్వించే మాటలు పాటలు కావాలి

మానవ స్పర్శలు పెంచే హృదయ వీణియలు మీటే
గట్టిమాటలు మూటలు గట్టే  మనుషులు కావాలి

వెల్లువల్లో కొట్టుకు పోయే మనుషుల్ని ఆపి కూర్చోబెట్టి
సేదతీర్చే మాటల లేపనాలు కావాలి
అవి ప్రసరించే ఎల్లలు లేని ఆనందాలు కావాలి

మనిషి మనిషిగా మారే మాటలు జల్లులుగా  రాలాలి మనిషి మనిషిగా ఆనందంగా పక్షుల్లా ఎగరాలి
       - శాంతివనం  మంచికంటి

సౌందర్య పిపాసి


సౌందర్య పిపాసి

నుదిటిన విభూతి ధరించి వచ్చాడతడు
మూసిన కన్నుల్ని విప్పకుండానే
నిద్రవోతున్నతల్లి  మనసుని తట్టి లేపాడు

పంట చేలో పైరగాలి వీచినట్టుగా
సుతిమెత్తని ఉన్ని చేస్పర్శతో
అద్దుతూ అద్దుతూ
అనంత లోకాలకు తీసుకు వెళ్ళాడు

కత్తి నిండా పూల వనాన్ని చుట్టి
చర్మానికి సుగంధ లేపనం అద్దినట్టు
అద్దుతూ అద్దుతూ మాటల వనంలోకి మౌనంగా  నడిపించుకు వెళ్ళాడు

ముఖం నిండా పన్నీటి జల్లును తొలకరి చినుకుల్లా చిమ్మి
సుగంధ లేపన పరిమళ మద్దాడతను
ఆ చేస్పర్శతో  మౌనంలోని నవ నాడులు మేల్కొల్పి  ఏవో లోకాలకు రథంపై ఊరేగింపుతో తీసుకు వెళ్ళాడు

అపూర్వమైన చిత్రకళాకారుడులా
పని తనానికి మెరుగులు దిద్దుతున్నట్టుగా
అతను కత్తితో చర్మంపై
చిత్రలేఖనాన్ని  లిఖిస్తున్నట్టు
రాతిపై ఉలితో శిల్పాలు చెక్కుతున్నట్టు    కళా తృష్ణ తీర్చుకుంటున్నాడు

కళ్ళలో ఏవో వెలుగుల్ని పూయించాలని చర్మానికి తళుకులద్దే పని అతి నేర్పుగా చేసుకుపోతున్నాడు

నిద్రపోతున్న హృదయ వనానికి
మెలకువ తెలీకుండా గుసగుసగా కత్తితో
వెనుకా ముందుకూ  కదులుతున్నాడు

పూల స్పర్శ తోనే తలను అటూ ఇటూ
కదిలీ కదలనట్టు
నెమ్మదిగా మరింత నెమ్మదిగా
మూసిన కన్నులు మూసినట్టుగానే
ఒక దేవతార్చనలో నిమగ్నమైనట్టు
పూజా సామగ్రిని అమర్చినట్టు  అగరువత్తులను 
హారతి కర్పూరం వెలిగించినట్టుగా
నైవేద్యం సమర్పించినంత ధ్యానంతో ధ్యాసతో

 చేయి చేసే సైగలతోనే మోము అందాలకు పుప్పొడులు తెచ్చి అద్దుతూ అద్దుతూ
ఒక మైకంలోకి
ఒక మధుర స్వప్నంలోకి
 ఒక పురాభావంలోకి       
 ఒక పూపోదరింట్లోకి       
ఒక వెన్నెల వర్షంలోకి
నా బాల్యంలోకి
లాక్కెళ్ళి పోతున్నాడీ క్షురకుడు
- శాంతివనం manchikanti