16 జూన్, 2013

పసికూనకు బోసినవ్వే కరువైపోయింది


పసికూనకు బోసినవ్వే కరువైపోయింది

కన్నులు మూసే పిల్లల కన్నీళ్ళ వెనుక
ఏ బాధల గాధలున్నాయో కాస్త కళ్ళు విప్పి చూద్దామా
అసువులు బాసే అందాల బొమ్మల ఆత్మలతోనైనా మాట్లాడేద్దామా
అనగనగా కథలు విన్న సాంస్కృతిక రాజ్యంలో   
పసికూనకు బోసినవ్వే కరువైపోయింది
పుట్టిన పాపకు నడకలు నేర్పకపోయినా పరవాలేదు
వుగ్గుపాలతో పరభాషను నూరిపోసేంత
నరకంలోకి జారిపోయామిప్పుడు
పిల్లల భవిష్యత్తు కలల పెరట్లోకి ఎన్నెన్నో నరకాలు
అడుగులు వేసుకుంటూ వచ్చేశాయి 
సంస్కృతి తెలియదు భాషలేదు
నోటమాటెలా వస్తుంది
మనసుపొరల్లో ప్రేమలెలా విచ్చుకుంటాయి
పరాయి భాషా నూరిపోతలో
బ్రతికి వున్నదీ తెలియదు
ప్రాణం పోయేదీ తెలియదు
చల్లని గాలుల ఆస్వాదనలేమిటి
పచ్చటి సాయంత్రాల కేరింతలెక్కడ
మనిషిమనిషినీ కలిపి కుట్టే
ఆత్మీయాను బంధాలకు తావెక్కడ
సుడులు తిరిగే దుఖ్ఖపు హోరులో
ఎవరు ఎవరికి ఏమౌతారొ
బతుకు పోరులో ఎవరికి ఎందుకు ఖైదీలయ్యారో
తెలియని యుద్ధంలో  రాటుదేలిన యంత్రాలు వీళ్ళు

మంచికంటీ శాంతివనం 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి