26 ఏప్రి, 2010

"పాఠకుల సంఖ్య పెరగడమేలా"

మనిషి తాను ఏ పరిస్థితులలో ఉన్నా తన మనుగడ సాగించడానికి ,తన జీవన యాత్రలో సంభవించే ఆటుపోట్లను ఎదుర్కోవడానికి ప్రాపంచిక జ్ఞానం అవసరం .మనిషికి జ్ఞాన్నిచ్చే ప్రధానమైన మార్గాలలో పుస్తకం ఒకటి .ఇవాళ ప్రత్యేకించి మన రాష్ట్రంలో టివీ ,సినిమా ,ఇతర ఆదాయ వనరులు, అనేక వ్యాపకాల వల్ల మనుషులు పుస్తకానికి దూరం అయ్యారు. ఈనాటి ఇంగ్లీషు చదువులవల్ల ఒక తరం సర్వ నాశనం అయిపోయింది .దీంతో ఎన్నోరకాల సమస్యలు మనుషుల్ని పట్టి పీడిస్తున్నాయి . మనుషుల్ని ఆత్మహత్యలవైపు ప్రేరేపిస్తున్నాయి .వీటి నుండి బయట పడాలంటే మళ్లీ పుస్తకం వైపు అడుగులు పడాల్సిందే .
ఇప్పటికే పిల్లల సాహిత్యం పుంఖాను పుంఖాలుగా వెలువడుతూ ఉండడముతో పిల్లలు నెమ్మది నేమ్మదిగా పుస్తకము వైపుకు మరలారనే అనుకోవాలి. కాని ఈనాటి విద్యా విధానంవల్ల, తల్లిదండ్రుల ప్రలోభం తారాస్థాయికి చేరుకుంది.ఎక్కడ పిల్లలు సాహిత్యం చవితే కాలము వృధా అయి పోయి ర్యాంకుల్లో వెనుకపడి పోతారనే అపోహలో తల్లిదండ్రులు ఉన్నారు. వాస్తవానికి మనం గమనించాల్సింది పిల్లలు ఎంత సృజనాత్మకంగా ఉంటే చదువులో కూడా అంత ముందు ఉంటారు .పుస్తకాలను ఎంత చదివితే చదువులోనూ ,జీవితములోనూ అంత ముందు ఉంటారు.
మామూలు తల్లిదండ్రులు సరే కథకులూ ,కవులూ, సాహిత్యవేత్తలూ, అలా అనుకునెవాళ్ళూ కూడా వాళ్ళ పిల్లలకూ సాహిత్యం అలవాటు చెయ్యడం లేదు. కొంతమంది సాహిత్యకారులైతే సాహిత్యం చదివే పిల్లల్ల్ని సైతం మానిపించి పుస్తకాలకు దూరంగా ఉంచారు .సాహిత్యం ద్యారా సమాజానికి చెప్పాలనుకునేది ముందు మనవాళ్ళకు మనపిల్లల దగ్గర నుండే మొదలు పెట్టాలి.
మామూలు తల్లిదండ్రులు సరే కథకులు,కవులు,సాహిత్యవేత్తలు అనుకునేవాళ్ళూ వాళ్ళ పిల్లలకు సాహిత్యం అలవాటు చెయ్యడము లేదు.కొంతమంది సాహిత్యకారులు సాహిత్యం చదివే పిల్లల్ని సైతం చదవడంమాన్పించి పుస్తకాలకు దూరంగా ఉంచుతున్నారు.చాలామంది సాహిత్యం ద్వారా సమాజానికి చెప్పాలనుకునేది ముందు మనవాళ్ళ దగ్గరనుండే మొదలు పెట్టాలి అనుకోవడంలేదు.
ఇవాళ పాఠకుల సంఖ్య చాలా తగ్గిపోయింది అని అందరం బాధపడుతున్నాము.రాష్ట్రం మొత్తం మీద సాహిత్యానికి సంబంధించి వివిధ రంగాలలో ఎన్నో వేల మంది ఉంటారు.వీళ్ళు రోజూ కలుసుకునే పిల్లలు,వీళ్ళు రోజూపాఠ్యాంశాలు బోధించే పిల్లలు ఎంత మంది ఉంటారు.రోజువారీ పాఠ్యాంశాలలో భాగంగా ఒక కథనో,కవితనో,పాటనో,పద్యాన్నో పిల్లలకు వినిపిస్తే భాషమీద ఎంత మమకారం పెరుగుతుంది.అక్కడ నుండేకదా పాఠకుడు మొదలయ్యేది.రచయిత ప్రారంభమయ్యెది.అలానే ప్రతి సాహిత్యకారుడూ మొహమాటానికి పోకుండా తాను ఉండే ఆఫీసులోనో ,తాను పనిచెసే శాఖలొనో ఎందరినో ప్రభావితమం చెయ్యొచ్చు.మొహమాటానికి కొందరు ఆమోదించినా కొందరైనా నిజం తెలుసుకునే వాళ్ళూ ఉంటారు. వాళ్ళద్వారా వాళ్ళ పిల్లల్ల్ని వాళ్ళ ఇంటిలోని వారిని కూడా ప్రభావితం చెయ్యొచ్చు.
మనిషి తలుచుకుంటే ఏపనినైనా సాధించవచ్చు.అయితే ఎవరో చేస్తారు, అందాకా వేచి చూద్దాం అనే ఉదాసీనత మనుషుల్లొ స్థిరపడిపోయింది.అందుకే ఎందరో మేధావులూ, జ్నానులూ ఉండి కూడా ఎవరో అజ్నానులు ప్రతిపాదించిన విధానాలను ఆమోదించి అందరం ఆదారిలొనే తలలొంచుకుని ఏమీ తెలియనట్టు సాగిపోతున్నాం.మనపిల్లలందర్నీతలలు వంచేసి ఆ గాటనే కట్టేస్తున్నాం.వాళ్ళకు జీవితమటే ఎమిటో తెలియకుందా చేస్తున్నాం.ఎన్నాళ్ళీ దుర్మార్గాన్ని భరించుదాం.మనవంతుగా మనమూ ముందడుగు వేద్దాం.మీరూ ఆలోచించండి.

15 ఏప్రి, 2010

పుస్తకమార్గం

ఊహ తెలిసినప్పటి నుండీ
పుస్తకాలను స్పర్శిస్తే చాలు
చందమామలు మా పెరటి చెట్టు కొమ్మలకు వేలాడేవి
నక్షత్రాలు మా ఇంటిముంగిట పందిరి వేసేవి
మేఘాలు ముసురుకుని పలపలా వర్షించేవి
అక్షరాలను ప్రేమగా వెన్ను నిమిరినప్పుడల్లా
రంగురంగుల పక్షులు ఎగురుతూ వచ్చి నా మేనిపై సయ్యాటలాడేవి
అడవులూ కొండలూ నదులూ లోయలూ
నా కళ్ళ ముందు కదులుతున్న చలనచిత్రాలయ్యేవి
ఒంటికంటి రాక్షసులూ అందమైన రాకుమార్తెలూ
మా ఇంటికొచ్చి పలకరించి పోయేవాళ్ళు
ఆకాశంలోకి ఎగరాలనుకున్నప్పుడు పుస్తకంలో తలదూర్చి
మబ్బుల్లో గిరికీలు కొట్టేవాడిని
ఈదాలనుకున్నప్పుడు సెలయేటి నీటిలో సయ్యాటలాడేవాడీని
ఇంద్రధనస్సులను పిలిచి రంగుల్లో మునిగి తేలేవాడిని
రాజహంసలతో సరాగాలాడేవాడిని
పుస్తకాల్నిండా నెమలికన్నులు అప్పుడప్పుడూ
బిడ్డల తల్లులయ్యేవి
వెలుతురు పిట్టలు మంత్రపు పుల్లలు తెచ్చిచ్చేవి
దూరాభారం ప్రయాణించాలనుకున్నప్పుడు
హాయిగా వెల్లకిలా పడుకుని కళ్ళు మూసుకుని
ఇష్టమైన పుస్తకాన్ని పొట్టపై బోర్లించుకునే వాడిని
రెక్కలు మొల్చుకొచ్చి ఎన్ని యోజనాలైనా ఎగురుతూ పోయేవాడిని
పర్వతాల్ని అధిరోహించేవాణ్ణి
లోయల వెంట ఉరుకులు పరుగులు తీసేవాణ్ని
రాజభవనాలకు వెళ్ళి రాజుల్నీ రాణుల్నీ పలకరించొచ్చేవాడిని
పులులతోనూ సింహాలతోనూ జూలు పట్టుకుని ఆడుకునేవాడిని
పుస్తకాల్నిండా ఎందరో నా సావాసగాళ్ళు కొలువుతీరి
సయ్యాటలకు ఉసిగొల్పుతుండేవాళ్ళు
పుస్తకం నాకు గాఢ నిద్రలో నుండి వెలుతురు తోటలోకి
దారి చూపే వెన్నెల పూదోట
మామూలు మనిషి ఙ్ఞాని కావడానికీ ఙ్ఞాని బుద్ధుడు కావడానికీ
ఎన్నెన్నో బోధనల్ని చేసేది పుస్తకమే
మనిషి మనిషిగా మనగలగడానికీ
పదిమందిని మానవతా స్పర్శతో అక్కున చేర్చుకోవడానికీ
పుస్తకం ఒక జీవన మార్గం పుస్తకమే ఒక జీవన గమ్యం

23 మార్చి, 2010

యుద్దం

సతత హరితానికి
మూలమూలల్లో
విస్తరించే గ్రీష్మం
ఎంత జడివానైనా
ఇట్టె పీల్చేయగల
ఇసుక పర్ర
ఎటువైపు ఎగురుతున్న
శ్వేత కపోతాన్నయినా
కూల్చేయగల
కరుకు ముక్కుల రాబందు
ఏ బంధాను బంధాలనైనా
తెగ నరికే రాక్షస ఖడ్గం
కురిసే విరిసే వెన్నెల్నిండా
చీకటి బెడగొండలు నింపే
పెను ఉత్పాతం
తాగే తాగే నీళ్లనిండా
కటిక విషాన్ని చిమ్మే
రాకాసి బల్లి
ఒక ఉన్మాదానికి
పూసిన
పిచ్చి జిల్లేడు పువ్వు
వెన్నెల మెడలపై
విషపు కత్తులు దించిన
రాతి గుండెల చప్పుడు
ఆయుధాగారాలను
ఆకలి కేకల సోమాలియాలకు
అరువిచ్చే విఫణి వీధి
ఏ సస్యశ్యామలాన్నయినా
మట్టి కరిపించే
ఎడారి
దేదీప్యమానమైన
వెలుగును చిదిమి
చీకటి కమ్మే అమావాస్య
సూర్యోదయాల కంట్లో
శుక్లాలు పూయించగల
గాడాంధకారం
వేల కలల్ని
భగ్గున మండించి
బూడిద చేసే నెరజాణ
ఏ రాత్రినీ
కలవరింతలు లేకుండా
తెల్లారనీయని పీడకల
పసి చిగురు టాకుల్నీ
టపటపా రాల్చేయగల
ఉన్మాది
నిలువెత్తు సంపదల్నీ
ఏట్లో విసిరేయగల
పిచ్చెక్కిన ఆధునిక శాస్త్రవేత్త
ఒకే పుర్రెను నింపిన
వేల దుష్టాలోచనల
చవిటి పర్ర
గుండెలనిండా
ఉక్కునాడాలు నింపుకుతిరిగే
జవనాశ్వం
పగ్గాలు తెంచుకుని
దూసుకుపోయే
రేసు గుర్రం
ఏ అపరాత్రో
నిదుర మబ్బులతో
పట్టిన దావాద్రి
తీరని కాంక్షల
కాలూ చెయ్యూడనీయని
హిట్లర్‌
ఒక వియత్నాం
ఒక ఆప్ఘనిస్తాన్‌
ఓ ఇరాక్‌
ఓ ఇజ్రాయిల్‌
ఒక అమెరికా
ఏ సమూహ గానాన్నయినా
తుంపులు తుంపులు చేసే
సుడిగాలి వడగాలి
ఆకాశాన్నీ పాతాళాన్నీ
చిటికెలో మాయం జేసే
మాయల పకీరు
భేతాళ మాంత్రికుడు
పచ్చగా సువాసన్లతో
విరగ్గాసే
మామిడి ప్రపంచాన్నిండా
సొనలు నింపే విష పాత్రిక
గాయాలు గాయాలుగా
నెత్తురు వరదలై పారించే
వరద ఉరవడి
పావురాల్నీ రామచిలకల్నీ
జెముడు కాకులుగా మార్చేసే
కాటిపాపడు
రూపాయి బిళ్ళపై
బొమ్మ బొరుసూ
రహస్యం విప్పి చెప్పే
రంగు రంగుల మాయావి
కొలిమిలో బెట్టి
మనిషిని సాగ్గొట్టే
ఎర్రగా మండే నెగడు
ఈ యుద్ధం
ఓ తీతువు కూసిన నేల
ఓ గుడ్లగూబ చూపు
ఓ కాష్ఠాల గడ్డ
ఓ చీకటి గుయ్యారం
ఓ తోడేళ్ళ స్థావరం
ఓ పులి గుహ
ఒక రాక్షస చూపు

16 మార్చి, 2010

తెలుగు సమాజాన్ని రక్షించుకుందాం

ఏ భాషా సమాజమైనా తన పిల్లలకు మాత్రుభాషలోనే విద్యాబోధన జరగాలని కోరుకుంటారు .కానీ మన తెలుగు సమాజం ఆంగ్ల చదువుల మోజుతో పిల్లలను నరకయాతన పెడుతున్నారు. నిజానికి మాతృభాషలో చదువు కుంటే ఏ భాషలోనైనా ప్రావీణ్యం పొందవచ్చు . అది మేము అనుభవంతో తెలుసుకున్నాము .అలా చదువుకున్న పిల్లలు ఆంగ్లం బాగా నేర్చుకోవడం గాక సృజన ప్రక్రియలో కూడా ముందే ఉంటారు .అది తెలియని పాలకుల నిర్ణయాలతో మనపిల్లలు పిచ్చివాల్లుగా మారి భవిష్యత్తు గురించి ఆలోచించే శేక్తి పోతుంది .ఇప్పుడు కూడా మనం ఆలోచించక పొతే మన పిల్లలను అజ్ఞానులుగా మన చేతులతోనే మార్చి వేస్తాం .మనం మేలుకుందాం .కనీసం ప్రాధమిక విద్యనైనా మన భాషలోనే నేర్పాలని అది రాష్ట్రమంతా అమలు జరిగేలాగా ప్రభుత్వమే చర్య తీసుకునేలాగా వత్తిడి తెద్దాం .మావంతుగా ఒంగోలులో రీడర్స్ క్లబ్ ,పిల్లల కథలు చదవడం,కొనిపించడం , పాఠశాలలకు వెళ్లి పిల్లలకు తెలుగు తీపి తెలియ చెయ్యడం ,యువకులతో తెలుగు చదివించడం ,పర్యావరణ అవగాహన కలిగించడం వంటి పనులతో ముందుకు నడుస్తున్నాం. మేరూ చెయ్యి కలపండి.మనం సాధిస్తాం .

3 జన, 2010

ఈ కొత్త సంవత్సరము ఎన్నెన్నో ఆశలు ఆశయాలతో

మొదటి రోజే ఎందరికో కొత్త సంవత్సరం
ప్రతి క్షణాన్నిప్రతి రొజునీ అర్ధవంతంగా ఆలోచించేవారికి
ఎపుడూ ఆనంద సంవత్సరమే
అనుకున్నది ఆచరించే వారికి అనుసరనీ సంవత్సరం
సమూహ దృష్టి కలిగిన వారికి సామాజిక సంవత్సరం
కళాత్మకంగా కవితాత్మకంగా జీవించేవారికి సాహితీ సంవత్సరం
సంబంద బాంధవ్యాలతో నిత్య హరితంలా జీవించే వారికి సాహితీ సంవత్సరం
విషాదంలో కూడా ఫక్కుమని నవ్వేవారికి ఆనందమైన సంవత్సరం
పక్కవాళ్ళ గురించి కూడా ఆలోచిస్తూ బతికే వాళ్లకు పరమానంద సంవత్సరం
ప్రకృతిలో తన్మయత్వం చెందే వాళ్లకు అనుభూతి సంవత్సరం
దూరదృస్టి కలిగి కాలాన్ని సద్వినియోగించే వారికి లక్ష్యాల సంవత్సరం
ధ్యేయం తో మందుకు నడిచే వారికి అర్ధవంత సంవత్సరం

23 డిసెం, 2009

ఈరాజకీయ దివాలాకోరుతనము కాదా

అంతా లోపాయకారితనమే. ఒక వైపు తెలంగాణా ఇస్తాము అనడము .ఇంకో వైపు సమైక్య ఆంధ్రా ఉద్యమానికి పొగపెట్టడము .లో గుట్టు పెరుమాళ్లకు ఎరుక .అన్నట్లుగా ఉంది ఆంధ్ర రాష్ట్రము లో రాజకీయ తతంగం .ఇవ్వాల్సినహక్కులు ఇచ్చేస్తే ఎంతో కాలముసంపాదన అంతా పోతుందన్నది సమైక్య వాదుల బాధ .ఇప్పటి దాకాసంపాయించినది మునిమనవళ్ళ దాకా సరిపోతుందిలే అనుకుని వొదిలి పెట్ట వచ్చు కదా 'అదేం కుదరడం లేదుఎందుకంటే అధికార దాహం.దీని కోసం ఎవరినైనా వొదులుకునే రాజకీయ నాయకులు ముందూ వెనుకా ఆలోచించేపరిస్తితిలో లేరు .
తెలంగానాలో నిరాహార దేక్ష ఎంత ఫార్సు గా జరిగిందో అంతకంటే వెయ్యిన్నొక్క రెట్లు నాటకాల వాళ్ళు రాయలసీమఆంధ్రా లో బయలు దేరారు .అందరు బజారునపడి కొట్లాడుతున్న తెర వెను రాజకీయం తెర వెనుకే జరుగుతుందిఅర్ధం కాని అర్ధం చేసుకోలేని సామాన్యుడే ఇప్పుడు అమాయకుడు.
తెలంగాణా వాళ్ళకేదో అన్యాయం జరుగుతున్దంట కదా వాళ్ళ మానాన వాళ్ళని వదిలి వేద్దామంటే అయ్యో ఇన్నిసంవత్సరాలుగా అభివృద్ధి చేసిన హైదరాబాద్ ని వొదిలి పెట్టడమా ససేమిరా అంటున్నారు సమైక్య వాదులు.అంటే ఏదోపోతున్దనేగా;ఏమి పోతుంది.ఎవరిది పోతుంది.ఎంతవరకు పోతుంది. ఇది సామాన్యుడికి అర్ధం కాని ప్రశ్న .సరే తెలంగాణావచ్చింది అనుకోండి ఎవరికీ వొరుగుతుంది అంటే అక్కడ సామాన్యుడికి అర్ధం కాకుండానే ఉంది.ఒక వేళ ఇస్తే అప్పుడుకూడా సామాన్యుడికి కొట్లాట ఎట్లాగూ తప్పదు .కాకుంటే ఈసారి తెలంగాణా పెట్టుబడిదారులతో .అంటే మొత్తంమీద ఉద్యమం కూడా ప్రజల చేతులలో లేదు.కేవలం నాయకులు ఆడుకుంటున్న జూదంలో సామాన్యులు నలిగిచస్తున్నారు.అయితే వీటి మధ్య మేధావులు కూడా అర్ధం లేని వత్తాసులు పలకడం బాగా లేదు.
మధ్య మధ్యలో రకరకాల పాత్రధారులు రకరకాల వేషధారులు ,రంగురంగుల పార్టీలూ అన్ని రంగంలోకి దూకిపోఇన పదవులూ వస్తాయనుకున్నసింహాసనాలూ అన్నిటిని తలుచుకుని తలుచుకుని వెక్కిళ్ళు పెడుతూ మరి రోడ్లపాలయ్యారు .వీళ్ళుఅయితే అయ్యారుకాని ఏమి తెలియని అమాయకులను కూడా రోడ్ల పాలు చేసారు. మద్యలోఅత్యుత్సాహం ప్రదర్సించే కొందరు అమాయకులు ప్రాణ త్యాగాలూ బలిదానాలూ అంటూ ఆహుతి అవుతూ ఉన్నారు.
మా అభిప్రాయం చెప్పేసాము మీరే తన్నుకుచావండి అంటూ పైనున్న కామందుల వారు తెలియనట్టు చూస్తూదోబుచులాడుకుంటున్నారు.ఏది ఏమైనా తెలంగాణా ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది కేంద్రం అనుకూల అననుకూలపరిస్తితులూ వారిని పరిపాలించే ప్రపంఛ బాంక్ అధిపతుల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటుంది.
ఎవరు ఏం ఛేసినా ఎవరికీ లాభనష్టాలు వచ్చినా ముమ్మూర్తులా నష్టపోయేది మాత్రం సామాన్యుడే. బందులూదిక్షలలో నష్టపోయిన మొత్తాన్ని సామాన్యుడి నెత్తి మీద ధరల రూపములో పడడం మాత్రం ఖాయం. పాపం ఎవ్వరిదనిఅందరూ ప్రశ్నించాలి .అందుకే ఏదైనా ప్రజలే గోదాలోకి దిగే సాధించుకోవాల్సిందే కాని రాచకీయ నాయకులప్రాపకంతోనో,జాలీ దయల్తోనో వస్తుంది అనుకుంటే అంతా వొట్టి మాయా బజారే.
. .