15 ఏప్రి, 2010

పుస్తకమార్గం

ఊహ తెలిసినప్పటి నుండీ
పుస్తకాలను స్పర్శిస్తే చాలు
చందమామలు మా పెరటి చెట్టు కొమ్మలకు వేలాడేవి
నక్షత్రాలు మా ఇంటిముంగిట పందిరి వేసేవి
మేఘాలు ముసురుకుని పలపలా వర్షించేవి
అక్షరాలను ప్రేమగా వెన్ను నిమిరినప్పుడల్లా
రంగురంగుల పక్షులు ఎగురుతూ వచ్చి నా మేనిపై సయ్యాటలాడేవి
అడవులూ కొండలూ నదులూ లోయలూ
నా కళ్ళ ముందు కదులుతున్న చలనచిత్రాలయ్యేవి
ఒంటికంటి రాక్షసులూ అందమైన రాకుమార్తెలూ
మా ఇంటికొచ్చి పలకరించి పోయేవాళ్ళు
ఆకాశంలోకి ఎగరాలనుకున్నప్పుడు పుస్తకంలో తలదూర్చి
మబ్బుల్లో గిరికీలు కొట్టేవాడిని
ఈదాలనుకున్నప్పుడు సెలయేటి నీటిలో సయ్యాటలాడేవాడీని
ఇంద్రధనస్సులను పిలిచి రంగుల్లో మునిగి తేలేవాడిని
రాజహంసలతో సరాగాలాడేవాడిని
పుస్తకాల్నిండా నెమలికన్నులు అప్పుడప్పుడూ
బిడ్డల తల్లులయ్యేవి
వెలుతురు పిట్టలు మంత్రపు పుల్లలు తెచ్చిచ్చేవి
దూరాభారం ప్రయాణించాలనుకున్నప్పుడు
హాయిగా వెల్లకిలా పడుకుని కళ్ళు మూసుకుని
ఇష్టమైన పుస్తకాన్ని పొట్టపై బోర్లించుకునే వాడిని
రెక్కలు మొల్చుకొచ్చి ఎన్ని యోజనాలైనా ఎగురుతూ పోయేవాడిని
పర్వతాల్ని అధిరోహించేవాణ్ణి
లోయల వెంట ఉరుకులు పరుగులు తీసేవాణ్ని
రాజభవనాలకు వెళ్ళి రాజుల్నీ రాణుల్నీ పలకరించొచ్చేవాడిని
పులులతోనూ సింహాలతోనూ జూలు పట్టుకుని ఆడుకునేవాడిని
పుస్తకాల్నిండా ఎందరో నా సావాసగాళ్ళు కొలువుతీరి
సయ్యాటలకు ఉసిగొల్పుతుండేవాళ్ళు
పుస్తకం నాకు గాఢ నిద్రలో నుండి వెలుతురు తోటలోకి
దారి చూపే వెన్నెల పూదోట
మామూలు మనిషి ఙ్ఞాని కావడానికీ ఙ్ఞాని బుద్ధుడు కావడానికీ
ఎన్నెన్నో బోధనల్ని చేసేది పుస్తకమే
మనిషి మనిషిగా మనగలగడానికీ
పదిమందిని మానవతా స్పర్శతో అక్కున చేర్చుకోవడానికీ
పుస్తకం ఒక జీవన మార్గం పుస్తకమే ఒక జీవన గమ్యం

1 కామెంట్‌: