చెట్లసందుల్లో వెలుతురు తునకలు రాలుతుంటాయి
వాటిని ఒక్కొక్కటి ఏరుకుని కళ్ళకద్దుకోవాలి
గుండెల్నిండా చల్లని గాలుల్ని వెచ్చగా పీల్చుకుని
పచ్చపచ్చటి జీవధారల వెంట మనసు పారేసుకోవాలి
కాళ్ళనిండా కళ్ళు మొలిపించుకుని
వొంటినిండా మమతల స్పర్శను నింపుకుని
ఆకుపచ్చని లోయల్లోకి పరావర్తనం చెందాలి
చల్లని హ్రుదయాల్తో వెచ్చని సాయంత్రాల్ని
వొంటినిండా పులుముకుని
ఎరుపు రంగుల్ని కళ్ళకు అద్దుకోవాలి
భూమి తల్లిని సజల నయనాలతో ముద్దాడేందుకు
కదిలి వొచ్చే వాన మబ్బులకు ఎదురుగా నిలబడి
పొగిలి పొగిలి ఏడుస్తూ నమస్కరించాలి
పచ్చటి పైరుతల్లిపై స్వేచ్చగా రెక్కల్ని విప్పార్చుకుని
తారట్లాడే పక్షుల్ని విచ్చుకున్న హ్రుదయాల్లోకి
ఆప్యాయంగా ఆహ్వానించడం నేర్చుకోవాలి
అంతరాంతరాల మూలమూలల్లోకి వెళ్ళి
సుతిమెత్తని స్పర్శతో పులకింపచేసే
సంగీతధారల్ని వీనులవిందుగా స్వాగతించాలి
చేతులు చేతులు పట్టుకుని
ఆకాశంలో విలాసంగా తిరిగే పైరగాలుల్ని
కళ్ళల్లోకి శ్వాసల్లోకీ సమస్త శరీరాంగాల్లోకీ
ఆవాహనం చేసుకోవాలి
ముడుచుకుపోయే భ్రుకుటి ముడి విప్పేసి
బాల్యజ్నాపకాల ప్రేమోహల్ని తలపుల్నిండా నింపుకుని
పగలబడి పగలబడి నవ్వదం నేర్చుకోవాలి
చీకటి తెరల్ని చీల్చుకుని
పూపొదరిళ్ళుంటాయి చూడు
చేతులు బార్లాసాచి
వాటిని ఆలింగనంచేసుకోవాలి
ఎండి మోడువారి
శుష్కించి పోయిన తలపుల్లోనుండి
పచ్చటి శ్వాసలు వెదజల్లే పైర్లను మొలిపించుకోవాలి
తల పైకెత్తి ఆకాశంనిండా
పుచ్చపువ్వుల్లా విరబూస్తున్న నక్షత్రాల్ని
రాత్రిని పక్కుమని నవ్వించే వెన్నెల పూరేకుల్ని
వొళ్ళువిరుచుకుని రారమ్మని వెర్రికేక వెయ్యాలి
అప్పుడప్పుడూ కన్నెర్రజేసే ఆకాశాన్నీ
చెవులు తుప్పొదిలేలా ఉరిమే ఉరుముల్ని
తళుక్కునమెరిసిపోయే మెరుపుల్ని
ఆపైన కుండపోతగా కురిసే నీటినవ్వుల్ని
వొంటినిండా చుట్టుకుని
చిందెయ్యడం నేర్చుకోవాలి
లోహాల్తో పోతపోసి కరుడుకడుతున్న హ్రుదయాల్ని
పూలచూపుల్తో కరిగించుకోవాలి
కర్కశమౌతున్న మనసు వాకిట
మానవత్వం రంగవల్లుల్నితీర్చిదిద్ది
తలుపులు బార్లా తెరిచి మనుషుల్ని ఆహ్వానించడం నేర్చుకోవాలి
చూడాలోయ్ చూపు సారించి దూరతీరపు పొలాల్లోకి
కొండలు దోసిళ్ళతో ఎత్తిపొసే జలపాతాల్లో నిండుగామునిగి తేలకపోతే
బతికిపోయినదానికి అర్థమేముంది!
"కర్కశమౌతున్న మనసు వాకిట
రిప్లయితొలగించండిమానవత్వం రంగవల్లుల్నితీర్చిదిద్ది
తలుపులు బార్లా తెరిచి మనుషుల్ని ఆహ్వానించడం నేర్చుకోవాలి"
మంచికంటి గారూ
అద్భుతమైన కవిత ఇది.
మనసు పొరల్లోంచి దుమ్మూ ధూళీ
చీపురుతో ఊడ్చినట్టు స్వచ్చంగా అనిపించింది.
మనుష్యులతో మనసు విప్పి,గుండె విప్పి
మాట్లాడుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది.
వస్తు వ్యామోహం లోంచి బయటపడి
పచ్చదనం వేపు ద్రుష్టి సారించాల్సిన
అవసరం మరింత ఎక్కువగా ఉంది.
అభిననదనలు.
కొండవీటి సత్యవతి
ఎడిటర్
భూమిక
BAAUNDI KAVITA_NIJAMGAA BAAUNDI-HRUDAYAM TALUPULNI BAARLAA TERICHI POEM NU LONIKI TEESKOVAALANI,KAASTA BUDDHI TECHUKUNI PAARESUKUNTONNA VAATNI YERUKOVAALANI ANPINCHELAA UNDI
రిప్లయితొలగించండి