26 ఏప్రి, 2010

"పాఠకుల సంఖ్య పెరగడమేలా"

మనిషి తాను ఏ పరిస్థితులలో ఉన్నా తన మనుగడ సాగించడానికి ,తన జీవన యాత్రలో సంభవించే ఆటుపోట్లను ఎదుర్కోవడానికి ప్రాపంచిక జ్ఞానం అవసరం .మనిషికి జ్ఞాన్నిచ్చే ప్రధానమైన మార్గాలలో పుస్తకం ఒకటి .ఇవాళ ప్రత్యేకించి మన రాష్ట్రంలో టివీ ,సినిమా ,ఇతర ఆదాయ వనరులు, అనేక వ్యాపకాల వల్ల మనుషులు పుస్తకానికి దూరం అయ్యారు. ఈనాటి ఇంగ్లీషు చదువులవల్ల ఒక తరం సర్వ నాశనం అయిపోయింది .దీంతో ఎన్నోరకాల సమస్యలు మనుషుల్ని పట్టి పీడిస్తున్నాయి . మనుషుల్ని ఆత్మహత్యలవైపు ప్రేరేపిస్తున్నాయి .వీటి నుండి బయట పడాలంటే మళ్లీ పుస్తకం వైపు అడుగులు పడాల్సిందే .
ఇప్పటికే పిల్లల సాహిత్యం పుంఖాను పుంఖాలుగా వెలువడుతూ ఉండడముతో పిల్లలు నెమ్మది నేమ్మదిగా పుస్తకము వైపుకు మరలారనే అనుకోవాలి. కాని ఈనాటి విద్యా విధానంవల్ల, తల్లిదండ్రుల ప్రలోభం తారాస్థాయికి చేరుకుంది.ఎక్కడ పిల్లలు సాహిత్యం చవితే కాలము వృధా అయి పోయి ర్యాంకుల్లో వెనుకపడి పోతారనే అపోహలో తల్లిదండ్రులు ఉన్నారు. వాస్తవానికి మనం గమనించాల్సింది పిల్లలు ఎంత సృజనాత్మకంగా ఉంటే చదువులో కూడా అంత ముందు ఉంటారు .పుస్తకాలను ఎంత చదివితే చదువులోనూ ,జీవితములోనూ అంత ముందు ఉంటారు.
మామూలు తల్లిదండ్రులు సరే కథకులూ ,కవులూ, సాహిత్యవేత్తలూ, అలా అనుకునెవాళ్ళూ కూడా వాళ్ళ పిల్లలకూ సాహిత్యం అలవాటు చెయ్యడం లేదు. కొంతమంది సాహిత్యకారులైతే సాహిత్యం చదివే పిల్లల్ల్ని సైతం మానిపించి పుస్తకాలకు దూరంగా ఉంచారు .సాహిత్యం ద్యారా సమాజానికి చెప్పాలనుకునేది ముందు మనవాళ్ళకు మనపిల్లల దగ్గర నుండే మొదలు పెట్టాలి.
మామూలు తల్లిదండ్రులు సరే కథకులు,కవులు,సాహిత్యవేత్తలు అనుకునేవాళ్ళూ వాళ్ళ పిల్లలకు సాహిత్యం అలవాటు చెయ్యడము లేదు.కొంతమంది సాహిత్యకారులు సాహిత్యం చదివే పిల్లల్ని సైతం చదవడంమాన్పించి పుస్తకాలకు దూరంగా ఉంచుతున్నారు.చాలామంది సాహిత్యం ద్వారా సమాజానికి చెప్పాలనుకునేది ముందు మనవాళ్ళ దగ్గరనుండే మొదలు పెట్టాలి అనుకోవడంలేదు.
ఇవాళ పాఠకుల సంఖ్య చాలా తగ్గిపోయింది అని అందరం బాధపడుతున్నాము.రాష్ట్రం మొత్తం మీద సాహిత్యానికి సంబంధించి వివిధ రంగాలలో ఎన్నో వేల మంది ఉంటారు.వీళ్ళు రోజూ కలుసుకునే పిల్లలు,వీళ్ళు రోజూపాఠ్యాంశాలు బోధించే పిల్లలు ఎంత మంది ఉంటారు.రోజువారీ పాఠ్యాంశాలలో భాగంగా ఒక కథనో,కవితనో,పాటనో,పద్యాన్నో పిల్లలకు వినిపిస్తే భాషమీద ఎంత మమకారం పెరుగుతుంది.అక్కడ నుండేకదా పాఠకుడు మొదలయ్యేది.రచయిత ప్రారంభమయ్యెది.అలానే ప్రతి సాహిత్యకారుడూ మొహమాటానికి పోకుండా తాను ఉండే ఆఫీసులోనో ,తాను పనిచెసే శాఖలొనో ఎందరినో ప్రభావితమం చెయ్యొచ్చు.మొహమాటానికి కొందరు ఆమోదించినా కొందరైనా నిజం తెలుసుకునే వాళ్ళూ ఉంటారు. వాళ్ళద్వారా వాళ్ళ పిల్లల్ల్ని వాళ్ళ ఇంటిలోని వారిని కూడా ప్రభావితం చెయ్యొచ్చు.
మనిషి తలుచుకుంటే ఏపనినైనా సాధించవచ్చు.అయితే ఎవరో చేస్తారు, అందాకా వేచి చూద్దాం అనే ఉదాసీనత మనుషుల్లొ స్థిరపడిపోయింది.అందుకే ఎందరో మేధావులూ, జ్నానులూ ఉండి కూడా ఎవరో అజ్నానులు ప్రతిపాదించిన విధానాలను ఆమోదించి అందరం ఆదారిలొనే తలలొంచుకుని ఏమీ తెలియనట్టు సాగిపోతున్నాం.మనపిల్లలందర్నీతలలు వంచేసి ఆ గాటనే కట్టేస్తున్నాం.వాళ్ళకు జీవితమటే ఎమిటో తెలియకుందా చేస్తున్నాం.ఎన్నాళ్ళీ దుర్మార్గాన్ని భరించుదాం.మనవంతుగా మనమూ ముందడుగు వేద్దాం.మీరూ ఆలోచించండి.

15 ఏప్రి, 2010

పుస్తకమార్గం

ఊహ తెలిసినప్పటి నుండీ
పుస్తకాలను స్పర్శిస్తే చాలు
చందమామలు మా పెరటి చెట్టు కొమ్మలకు వేలాడేవి
నక్షత్రాలు మా ఇంటిముంగిట పందిరి వేసేవి
మేఘాలు ముసురుకుని పలపలా వర్షించేవి
అక్షరాలను ప్రేమగా వెన్ను నిమిరినప్పుడల్లా
రంగురంగుల పక్షులు ఎగురుతూ వచ్చి నా మేనిపై సయ్యాటలాడేవి
అడవులూ కొండలూ నదులూ లోయలూ
నా కళ్ళ ముందు కదులుతున్న చలనచిత్రాలయ్యేవి
ఒంటికంటి రాక్షసులూ అందమైన రాకుమార్తెలూ
మా ఇంటికొచ్చి పలకరించి పోయేవాళ్ళు
ఆకాశంలోకి ఎగరాలనుకున్నప్పుడు పుస్తకంలో తలదూర్చి
మబ్బుల్లో గిరికీలు కొట్టేవాడిని
ఈదాలనుకున్నప్పుడు సెలయేటి నీటిలో సయ్యాటలాడేవాడీని
ఇంద్రధనస్సులను పిలిచి రంగుల్లో మునిగి తేలేవాడిని
రాజహంసలతో సరాగాలాడేవాడిని
పుస్తకాల్నిండా నెమలికన్నులు అప్పుడప్పుడూ
బిడ్డల తల్లులయ్యేవి
వెలుతురు పిట్టలు మంత్రపు పుల్లలు తెచ్చిచ్చేవి
దూరాభారం ప్రయాణించాలనుకున్నప్పుడు
హాయిగా వెల్లకిలా పడుకుని కళ్ళు మూసుకుని
ఇష్టమైన పుస్తకాన్ని పొట్టపై బోర్లించుకునే వాడిని
రెక్కలు మొల్చుకొచ్చి ఎన్ని యోజనాలైనా ఎగురుతూ పోయేవాడిని
పర్వతాల్ని అధిరోహించేవాణ్ణి
లోయల వెంట ఉరుకులు పరుగులు తీసేవాణ్ని
రాజభవనాలకు వెళ్ళి రాజుల్నీ రాణుల్నీ పలకరించొచ్చేవాడిని
పులులతోనూ సింహాలతోనూ జూలు పట్టుకుని ఆడుకునేవాడిని
పుస్తకాల్నిండా ఎందరో నా సావాసగాళ్ళు కొలువుతీరి
సయ్యాటలకు ఉసిగొల్పుతుండేవాళ్ళు
పుస్తకం నాకు గాఢ నిద్రలో నుండి వెలుతురు తోటలోకి
దారి చూపే వెన్నెల పూదోట
మామూలు మనిషి ఙ్ఞాని కావడానికీ ఙ్ఞాని బుద్ధుడు కావడానికీ
ఎన్నెన్నో బోధనల్ని చేసేది పుస్తకమే
మనిషి మనిషిగా మనగలగడానికీ
పదిమందిని మానవతా స్పర్శతో అక్కున చేర్చుకోవడానికీ
పుస్తకం ఒక జీవన మార్గం పుస్తకమే ఒక జీవన గమ్యం