ఏడవండి. బాగా ఏడవండి. ఇంకా గొంతులు పెంచి నలుగురికీ వినపడేటట్టు వెక్కి వెక్కి ఏడవండి. దీనికి బాధపడాల్సిన పనేముందమ్మా. సంతోషంగానే ఏడవండి. ఆనందం తన్నుకు వొస్తుంటే పొగిలి పొగిలి ఏడవండి.
మీఇంట్లో ముసలివాసనేయదింక.మీ వసారాలో ఒంటేలు వాసనేవెయ్యదింక. మీ కాళ్ళకు చేతులకూ అడ్డుపడే వాళ్ళే ఉండరింక. అటుఇటూ పోయే వాళ్ళని ఎవ్వరూ పలకరించనే పలకరించరు. వాళ్ళనీ వీళ్ళనీ తీసుకు వచ్చి మంచాలు విరగగొట్టేవాళ్ళే ఉండరు. ఇంటి ముంగిట్లో నలుగురు మణుసులు కూర్చుని మాట్లాడే మాటలే వినబడవింక. హాయిగా శ్మశానంలోలా ఎంత నిశ్శబ్దంగా ఉంటుందో మీ ఇల్లు. అందుకే ఏడవండి. మనసుని పిచ్చి గంతులు వేయిస్తూ ఏడవండి.
మీ పిల్లలకింకా పిట్టకథలూ,నీతి కథలు చెప్పి చెడగొట్టడానికి ఎవ్వరూ లేరుగా. ఆటలు ఆడిస్తూ పాటలు పాడిస్తూ కాలాన్ని వృధా చేసే వాళ్ళే లేరుగా. పిల్లల్ని పిచ్చిపట్టిందాకా చదివించొచ్చు.
నిండు ముత్తైదువ అట్టా ఉండకూడదమ్మా. అలా ఉంటే ఇంటికే అరిష్టమమ్మా.పొద్దున్నే లేచి మొఖం కడుక్కుని,తలదువ్వుకుని, బొట్టుపెట్టుకొని నట్టింట్లో తిరుగుతా ఉంటే ధనలక్ష్మి ఘల్లు ఘల్లుమంటూ గజ్జెలు కట్టుకొని తిరుగుతుందమ్మ అని చెవినిల్లు కట్టుకొని పోరు పెట్టేవాళ్ళేవరున్నారమ్మా.
అయ్యా నీకు మాత్రమేం నాయనా. పనులు చేసుకోకుండా బలాదూరు తిరుగాతారెందుకురా. తాగితందనాలు తొక్కడం మన ఇంటావంటా ఉందంటారా అని వెంటబడేవాళ్ళే లేరు కదా! ఇరుగింటికాకి పొరుగింటికాకింకమీ వాలనేవాలదుకదా! ఎందుకింత దుఃఖం పడతారు. కాస్త సుఖంగానే ఏడవండమ్మా.
అమ్మాయ్ బాధంతా నీదేనమ్మాయ్.టంచన్ గా ముప్పూట మూడు పొద్దులూపిండం పెట్టే బాధ్యత తీరిపోయింది కదమ్మా. నువ్వే బాగా ఏడవాలి తల్లీ. ఇంతకాలం బరువూ బాధ్యతలూ మోసిన దానిని కదా! కాస్త బలంగా ఏడవాలమ్మా.
దమ్మూ చాలడం లేదా! ఎట్టామ్మా అలాగంటే. కాస్తె… ఆఅ…. ఆఅ….. ఇంకాస్త నాభి నుండి ఊపిరి బిగపట్టమ్మా. కాస్త ఎగిరెగిరి పడినట్టుంటే కదా! ఎక్కిళ్ళు విచ్చినట్టు ఉండాలమ్మా.
ఆ….. ఆ….. ఇప్పుడు కాస్త పరవాలేదు. అటు చూడమ్మా. తెలియకపోతే చూసి నేర్చుకోవాల కదమ్మా.
పెద్దకూతురు చూడు చాలినంత బంగారం చేయించలేదని బతికినంతకాలం సాధించినా ఇప్పుడు చూడు ఎంత బాగా ఏడుస్తుందో! ఏం పిల్లవో ఏదీ దాచుకో లేవు.
అబ్బెబ్బే……. నువ్వు ఏడుస్తున్నట్టే లేదమ్మా. ఎంత పరాయింటి దానివైనా, కోడలన్న తరువాత బాధ్యత ఎక్కువకదంటమ్మా. అందరికన్నా నువ్వే ముందుండాల. ఇదుగో ఇంకలాభం లేదుకానీ ఆ పవిట చెంగు నోట్లోనన్నా దోపుకో. ఆ…… ఆ…… ఇప్పుడు కాస్త పరవాలేదులే. ఏడుపుకళవొచ్చేసింది.
అబ్బాయ్ ఇట్రాయ్యా. నువ్వు మరీ అంత సిగ్గుశరమా లేకుండా బరితెగించి తిరుగుతాండావే. ఇయ్యాల ఒక్క రోజన్నా మీ ఆనందాల్ని లోపల దాచుకోండయ్యా
రా….. ఇక్కడొచ్చి కూర్చో.కాస్త యాడవడం నేర్చుకోండయ్యా బాబు పెద్దవాళ్ళంటే బతికున్నపుడు మర్యాదా మన్ననా ఎలాగూ లేదు. పోయినప్పుడైనా నటించకపోతే ఎలాగయ్యా.
పాడెకట్టడానికిపోతుండావా! వోయబ్బో నువ్వు కట్టకపోతే అక్కడ చాలా మంది ఉండార్లేవయ్యా. వాళ్ళు కడతారు పాడె. రా….. నువ్విట్రా…. ఇట్టాచ్చి కూర్చో
ఎట్టా బతికినోడయ్య మీ నాయన. ఎంతమంది నోళ్ళల్లో నానతా ఉండేవాడు. సాయం చెయ్యమని అడిగినోళ్ళకి ఏదోరకంగా చెయ్యి అందించే వాడో కానీ,కాదూ లేదూ అనే మాట ఆయన నోట్లో నుండి ఎప్పుడైనా వచ్చిందంటయ్యా. ఎవురెవరో వొచ్చి ఏడిస్తా ఉంటే నువ్వు యాడవకపోతే ఏం బాగుంటదయ్యా.
రా… రా…. ఇటొచ్చి కూర్చో. ఇంక మొదలుపెట్టు. రైట్….. ఇంకొంచెం శృతి పెంచయ్యా. ఆ పెళపెళ్లాడే చొక్కావిప్పి అవతల పారెయ్యవయ్యా.శవం ముందు ఎట్టా కూర్చోవాలో కూడా తెలవకపోతే ఎట్ట. లోపల సంతోషం ఈ ఒక్కరోజన్నా ముఖంలో కనిపించనియ్యకూడదయ్యా. ఆ…. ఇప్పుడు కాస్త పరవాలేదులే. అద్దం లో చూసుకోని ఏడుస్తావా!
వొద్దులేయ్యా అన్నీ చూసుకోవడానికి నేనొకణ్ణి తగలబడ్డానుకదయ్యా. అమ్మాయ్ ఒక టవలియ్యమ్మా. ఇదుగో ఇది తీసుకుని నెత్తిమీదవేసుకో. ఆ ఇప్పుడు కాస్త అవతారం కుదిరిందిలే. ఇంక కానీయ్. మరీ ఇంత చిన్న మూలుగేనా! కాస్త రాగాలు తియ్యవయ్యా.
ఎట్టనా! ఎట్టేముంది. నువ్వు పూటుగా తాగినప్పుడు తీస్తావే అట్టా. ఆ…. అద్దీ అదీ పట్టు. ఇంక కానీయ్.
ఇప్పుడు నలుగురూ శవం ముందు కూర్చోని ఒకరికొకరు తోడు తోడుగా ఏడుస్తుంటే కళకళ లాడుతుళ్ళా. మణిసిపోయిన ఇంట్లో ఈ మాత్రం కళ కూడా లేకపోతే ఎట్టా.
ఎవురయ్యా అక్కడ? ఏందదీ. యాడవడం బాగానే ఉందా! కన్నీళ్ళే రావడం లేదంటవా! బాధపడి బాధపడి ఇంకిపోయాయ్యయ్యా. యాణ్ణుండి కారతాయ్యాంట. ఇదుగో అమ్మా వాళ్ళేదో అంటన్నారు చూడండమ్మా.
యాడవడమే గొప్పంటారా! అమ్మమ్మా అట్టంటే ఎట్టమ్మా! ఆడగూతుళ్ళు మీ వల్లే అయిద్దామ్మా. మీ దగ్గిరే బోలెడన్ని కన్నీళ్ళు ఉంటయ్యి కదమ్మా. నీ పెళ్ళిచెయ్యడానికి ఆయన పడని కష్టం లేదమ్మా. నువ్వు కాస్త పెద్ద మనసు చేసుకోమ్మా.
ఏందమ్మా నీ పెళ్ళికి మంచి పట్టుచీరె కొనియ్యలేదంటావా! పోనియ్యిలే తల్లీ ఆయన పాపాన ఆయనే పోయాడు. నువ్వే కాస్త పెద్ద మనసు చేసుకోని, కాసిని కన్నీళ్ళు ధార పోయమ్మా.
పాపం ఏ పని తల పెట్టినా చచ్చి దుగ్గయ్యేవాడమ్మా. ఆయన కాబట్టీ అవసరానికి ఎంతైనా అప్పుతెచ్చి పని గడిపేవాడమ్మా. అంత గుండె ధైర్యం కలవాడిని నేనింత వరకూ చూడలేదమ్మా.ఎంత కావాలన్నా, ఏమి కావాలన్నా తెల్లారేసరికి పుట్టించ్చేవాడమ్మా.
నీ పెళ్ళి అంత బహ్మాండంగా జరపకపోయినా, ఉన్నంతలో నీకు బాగానే చేశాడమ్మా. అయినా నా వల్ల కాదంటున్నావా తల్లీ. ఒక్క కన్నీటి బొట్టు కూడా లేదంటమ్మా.
అమ్మా చిన్నతల్లీ నువ్వమ్మా! బాగా చదువుకుంటున్నావని, నువ్వంటే పంచప్రాణాలుగా చూసుకున్నాడమ్మా. నువ్వన్నా ప్రయత్నించమ్మా. ఏంటమ్మా నా వంక అట్లా గుడ్లు మిటకరించుకోని చూస్తావు. ఏందమ్మా కళ్ళు వాచిపోతయ్యా. బుగ్గలుకందిపోతాయా! ఏందమ్మా అంత అమాయకంగా మాట్లాడుతుండావు. ఏడిస్తే మాత్రం పోయిన వాళ్ళు తిరిగొస్తారంటావా! నువ్వు చెప్పింది కూడా నిజమేనమ్మా. వస్తారనేనా అందరూ ఏడ్చేది.
అప్పటిదాకా అందరి బాగోగులు చూసి, అందరితోపాటు కలిసిమెలిసి ఉన్న ఒక మణిసి హఠాత్తుగా మన మధ్య నుండి వెళ్ళిపోతే ఎలా ఉంటుందమ్మ, ఇంటిముందు ఎంతో ఎత్తున ఎదిగిన వేపచెట్టును కొట్టేసినట్టు ఉండదా! కొద్దిగా ప్రయత్నించమ్మా. అస్సలు లాభంలేదా!
ఏమయ్యా నీ సంగతేంది! నువ్వు తగలెట్టిన వన్నీ పోగు చేసుకోవడం, నువ్వు అప్పులు చేసొస్తే వెనకనే వెళ్ళి వాటిని తీర్చేదాకా నిదరపోయెవాడెకాదు కదా. నువ్వన్నాపూనుకోవయ్యా.
మరీ అంత నిర్మొహమాటంగా మాట్లాడబాకయ్యా. కొంచెం పెద్ద మనసు చేసుకో. అవతల నలుగురు చూస్తుండారయ్యా. చూస్తే చూడనియ్యి అంటావా! అయ్యో తండ్రీ ఎప్పుడూ ఆయన అట్ట అనుకోలేదయ్యా. అనుకునే వాడైతే నువ్వు పేకాట్లో బాకీ పడ్డప్పుడు వొంటి గుడ్డలు కూడా విప్పేసి, నిన్ను అక్కడ కూర్చోబెడితే, పోతే పోయాళ్ళే అని నీ ఖర్మకు నిన్నొదిలేసాడా! తన తలకు మించిన భారమైనా అప్పుడలా అనుకోలేదయ్యా. ఈ సారి చూద్దాము ఈ సారి చూద్దామని ప్రతీసారీ నీ తప్పును కాసుకున్నడే కానీ, పోతే పోయళ్ళే వాడి మానాన వాడు పోతాడని నిన్ను గాలికి వొదిలెయ్యలేదయ్యా.
అదేందయ్యా మరీ అట్టా మూతి బిగబట్టి కూర్చోబాకు. కాస్త వాళ్ళని జూడు లోపల లేకపోయినా ఏడుపుని ఎంత బాగా పెళ్ళగించి పెళ్ళగించి ఏడుస్తున్నారో చూడు. ఆ….. ఆ……. పరవాలేదు. ఈ ఫోజు కొంచం దగ్గరగా వొచ్చిందిలే. ఆహాహా ఇప్పుడు అచ్చం ఏడుస్తున్నట్టే ఉన్నావు.
చచ్చె చావు వొచ్చి పడిందయ్యా. మరీ ఇంత ఇదిగా తయరయ్యరేంది మణుసులు. ఇంత కొయ్యబారి పోయారేంరా బాబు. అస్సలు ఏమైపోయిందిరా! ఎవురికీ కాసిని కన్నీళ్ళు వొచ్చి చావడం లేదు.
ఈ పెద్దరికాన్నొకదాన్ని నా భుజానేశారు. ఎంత మందికని చెప్పాలి. ఏ విధంగా చెప్పాలి. అస్సలు ఈ పరిస్థితి ఒకటొస్తుందని కల్లోగూడా అనుకోలేదు. కనీపెంచి పెద్దచేసి చదువులు చెప్పించీ ఉద్యోగాలువేయించి ఇల్లు వొల్లు గుల్ల చేసుకుని చచ్చి దుగ్గయిపోయినా లెక్కలేదు. మనిషి పోయినా పోతే పోయాళ్ళే మంచాన కంచాన పడకుండా పోయాడు. ఈయనకి సేవలు చెయ్యకుండా పీడా పోయిందిలే అనుకుంటుండారుకానీ, కాస్త నలుగురి కోసం పాటు పడ్డ మనిసి కదా నాలుగు కన్నీటి బొట్లు విడుస్తారంటే అబ్బే అదీ వల్ల కావడం లేదు.
పైగా దబాయింపొకటి. కాలం తీరింది, పోయాడు. మనమేం చేస్తాం చెప్పండి అంటూ లోకరీతి చెబుతున్నారయ్యా లోకరీతి. ఇంత ఇదైపోయారేంది మణుసులు. మొహమాట మనేదే లేకుండా పోయింది. ఇట్టాంటి మణుసులు పుడతారని కూడా ఊహించలేదే మేము.
అవసరమున్నంత వరకే అక్క మొగుడు. అవసరం తీరింతరువాత కుక్కమొగుడా. మరీ ఇంత అవసరానికి మణుసులై పోయారేందో. కలియుగం కలియుగం అంటారే. ఇది మరీ దానెమ్మ లాగుందే! కూలికి విషం తాగుతున్నారు కదయ్యా.
పాడె తయారైంది! ఏం చెయ్యమంటారయ్యా. మాప్రయత్నం మేము చేస్తుండాము. కొంచేం ఊపు చెయ్యండమ్మా. ఆయ్యా మీరు కూడా కాస్త శృతి పెంచండి. ఆ…. ఆ…. అదే…….ఆ……అద్దే………………..కానియ్యండి.
ఎవర్రా ఏందో అంటున్నారు. బాగా ఏడుస్తున్నారు! ట్రైనింగ్ ఎలాంటిదంటారు. ఎవరి కళ్ళల్లో నీళ్ళు రావడం లేదా! శత విధాల ప్రయత్నిస్తున్నారయ్యా! చెలమలు ఎండిపోతే ఎవరేంచేస్తారు.
సాంగెం వొప్పుకోదా! ఎవురయ్యా ఇన్ని రూల్స్ పెట్టేవోళ్ళు. అసలు యాడవడమే రాలేదురా నాయనా అంటుంటె కన్నీళ్ళు రావడం లేదంట అసలుకు లేదురా మొగుడా అంటే పెసరపప్పే పెళ్ళామా అన్నాడంటయెనకటికి ఎవుడోఅట్టుంది సంబడం.
కన్నీళ్ళు రాలేదని ఒకరంటారు. ఏడుపులో జీవం లేదని ఒకరంటారు. కూర్చున్న పొజిషనే బాలేదని ఇంకో గన్నయిగాడంటాడు. ఇయ్యన్నీ ఇప్పుటికిప్పుడు నేర్వాలంటే ఎట్టకుదురుద్ది.
ఈసారికి ఏట్టనోకట్టా కానియ్యండి. ఇంకోసారి శవమేదన్న తయారైనప్పుడు అప్పుడు చూద్దాం. రాండి వచ్చి శవాన్ని ఎత్తుకెళ్ళి పాడె మీద పడుకోబెట్టండి.
కన్నీళ్ళు రాకుండా కుదరదంటే కుదరదా! ఎత్తుబడే చెయ్యగూడదా! అదుగో ఆ ఆడంగుల్ని మాట్లాడొద్దని చెప్పండి. తలా ఒక మాట మాట్లాడతారు. చివరికి పనేమే ముందుకు జరగనియ్యరు.
ఎన్నటికి ట్రయినింగు లియ్యాలమ్మాయ్. అస్సలు బొత్తిగా ఎందుకు పనికి రాని మణుసులుగా ఉండారేంది.
కన్నీళ్ళు రాకుండా ఎత్తుబడి చెయ్యడానికిలేదు అంతేగదా! అమ్మాయ్ ఇట్రా. అక్కడ పొయ్యి గణ గణా మండుతోంది గానీ కాస్త పచ్చి పుల్లలు నాలుగు తగిలియ్యమ్మా. ఎందుకా, ముందు చెప్పిన పని చెయ్యమ్మా నీకే తెలుస్తుంది.
ఇప్పుడర్థమైందా ఎందుకో! పొగ వొస్తుందా! ఇంకొద్దిగా పొయ్యి ఊదు, పొగ వొస్తుందా! బాగా…. ఇంకా బాగా…. అరెరే గాలి అటుకొడుతుందే. పొగంతా అటు పోతుందే! ఆ…. ఇటు మళ్ళిందిలే.
ఇప్పుడు వస్తయ్యిలేమ్మాయ్ కన్నీళ్ళు తన్నుకుంటా! నలుపుకోండి కళ్ళు బాగా నలుపుకోండి. కొంచెం మంటగా ఉంటదిలేయ్యా. మీ అయ్య జీవితాంతం మంట మండినోడే!మంటల్లోకి పోతాగూడా మీకు మేలె జేశాడుకదయ్య. ఈ కాస్త మంటకే అలా మండిపోతే ఎలాగా!
ఇప్పుడొస్తున్నాయ్యి కన్నీళ్ళు. చూడండమ్మా బాగా చూడండి. ఇంకేం పొరబాటు లేదుకదా! అందరి కళ్ళల్లో కన్నీళ్ళే. కారిపోతున్నయ్యి చూసేరుగా. బాగా చూడండి. ఇంక తంతు మొదలు పెట్టండి. ఎక్కువసేపు కన్నీళ్ళుకార్చలేరువాళ్ళు. మరీ సుకుమారం తేలిపోయినారిలే. ఆ జంగం దేవరిని శంఖు ఊదమని చెప్పండి.
రాండ్రా వొచ్చి పట్టండి పాడె మీదకి.ఎక్కడా ఏ ట్రబులూ లేదులే. ఆత్మపరలోకానికి వెళ్ళి పోతుందిలే.కానియ్యండి కానియ్యండి. పొద్దునడినెత్తిమీదకు వొచ్చింది కానియ్యండి. ప్రాణం ఉన్నంతకాలం సావు కోసం ఎదురు సూస్తానే బతికేడు. శవంగా మారిన తరువాత గూడా ఎంత గాశారం వొచ్చిందిరా నాయనా! ఏం కాలమో ఏం మణుసులో! తండ్రులెవరో బిడ్డలెవరో! ఎవరికి ఎవరో!
మీరింక లేవండమ్మా. లేసి ఏం చెయ్యాలా. ఇప్పటిదాకా ఏం జేసేరమ్మా. చాలా కష్టపడిపోయారు. మీ వొంటికి మించిన శ్రమ చేశారు కదా! కాస్త విశ్రాంతి తీసుకోండి.
ఆ నిప్పుకుండ తీసుకోవయ్యా నువ్వు మొయ్యలేవా! అదేం బరువుండదులేవయ్య. దానిగ్గుడా ఒక మణిసి కావాలా! ఎంతసున్నితంగా తయారయ్యారయ్యా.
ఏం కాలమో! ఏం మణుసులో! ఇది ఒంటికాలి కలియుగం కాదయ్యా. అసలు కాళ్ళేలేకుండా దోగడతా ఉంటే అవిటియుగమయ్యా ఈ కలియుగం.
పాడెని ఎత్తండింక. నలుగురూ తూకంగా పట్టుకోండీ. ముందున్నా వాళ్ళు జాగర్త. ఆ….. ఆ… నెమ్మదిగా సాగండి.
ఇదో వెంకయ్యా ఎక్కడికయ్య వెళుతున్నావ్ ? ఏందీ బర్రెగొడ్లుని విప్పాలా! సుబ్బయ్యా నువ్వు… నీగ్గూడా పనులుండాయ్యా. దింపుడు కళ్ళాందాకా గూడా రావడానికి తీరిక లేకుండా పోయింది మణుసులుకి. అరే.. మీరు కూడానా…. హూ.. పోండి పోండి అందరూ వెళ్ళిపోండి.
అయ్యా మీకేం పనీ పాటా లేవా! ఉండయ్యా. అయితే…! మీరు దాయాదులా! అదా సంగతి. తప్పక వొస్తున్నారన్నమాట. లేకుంటే మీరు కూడాపోయే వాళ్ళే.
ఎవరి దారిన వాళ్ళు పోయినా మొయ్యడానికి నలుగురు మనుషులుంటే చాలుగా. నడవండయ్యా మీరన్నా తొందరగా నడవండి. మీకు ఎలాగూ తప్పదుగా. చావుకూడా తప్పనిసరి తంతై పోయిందిలే.
బాగు౦ది, రియాలిటికి దగ్గరగా ఉ౦ది.
రిప్లయితొలగించండి