26 నవం, 2009

మత్తులోకి లాక్కెళ్ళి ప్రేమలోముంచెత్తే శరచ్ఛంద్ర ఛాయ-బంధన ఛాయ

గ్రీష్మతాపం పెచ్చరిల్లుతున్న అకవిత్వపు కాలంలో, హృదయాల నుండి హృదయాలకు సన్నజాజి పరిమళం వంటి సమ్మోహనపు సమయాలు కొడిగడుతున్న కాలంలో కవిత్వమంటే కేవలం దేహ సంబంధమైనదే అనుకుని పైపై మాటలతో వ్యాకరణాంశాలుగా మారిపోయిన గ్రీష్మతాపంలో బంధన చాయ చిరు జల్లై మనోవల్మీకంలోకి జొరబడిపోయింది.


నిద్రరాని రాత్రులకు, గాయమైన మనసులకు, భౌతిక సంబంధమైన వాంఛలకు దూరంగా ఐహిక సుఖమయ జీవితం నుండి తెలియని లోకాలకు పరుగులు తీయిస్తూ తన వెంటే సమ్మోహన లోకంలోకి లాక్కుపోయిందీ లేత మావి చిగుళ్ళ వసంతంలో ఎలకోయిల గాత్రం.

మనిషి ఎంతదాకా పరుగిడతాడు. ఎంత దూరం పరుగెడతాడు. అంతూ దరీ తెలిసేదుందా! అని పదే పదే ప్రశ్నించు కుంటున్నప్పడు ఇదుగో పరుగు ఆగడానికొక మంచుపూల చల్లదనం అని నిలవరించి పట్టు పరుపై కూర్చోబెట్టి, నీలగిరి తైలాన్ని మర్ధన చేస్తూ కమ్మని మాటల మధూదయాన్ని, గోధూళివేళ సంధ్యా సమయాల్నీ తెరపై చిత్రిస్తూ జీవితం మధురిమ నంత అప్పటి కప్పుడు మన కళ్ళ ముందుంచి, జీవిత మంటే ఏమిటో తెలిసిందా అది ప్రశ్నిస్తుందీ కవిత్వం.

ఏకాంత రాత్రి మువ్వల ధ్వని/నిమ్మళించిన సముద్ర తీరంలో / వందనీయ దివసాన్ని పరవశంతో ముద్దు పెట్టు కోవడం ఎంతమందికి సాధ్యమౌతుంది.
తాత్కాలిక బంధాలతో ఆ మాటకొస్తే అసలు అనుబంధాలే తెలియని లోకంలో శాశ్వత బంధాలతో ఉప్పొంగి పోతున్నాను. ఈ జీవితోత్సవ పర్యంతం ఒకింత మైకం కమ్మిన ప్రతీక్షలో ఊరేగుతున్నాను… ప్చ్‌ జీవితాన్ని ఉత్సాహవంతంగా ఉత్సవం చేసుకోవడానికి తడితడి హృదయాల కోసం ఎక్కడెక్కడని వెతకాలి. ఇవాళ నిజమైన జీవితాన్ని అనుభవించే మనిషి కోసం కారడవులు పట్టుకు వెతకాల్సి వొస్తుంది. ఎంత సుదీర్ఘజ్ఞాపకం గరగ నిండా.

ఒకే పోలికలున్నా/ సీతాకోక చిలుకల్ని/ చూడడంతో గడచిపోతుంది/ నిన్నటిలా ఇవాళ కూడా / ఆనవాలు పట్టి/ సమ్మిళిత సుదూర జ్ఞాపకాల్ని / మృదువుగా విప్పుతాను ఒకటొకటి కనురెప్పలపై వాలిన సీతాకోక చిలుకల రెక్కల్ని కర్కశంగా తుంచి రాక్షసత్వం చూయించే మానవ జాతి పెరిగిపోయిన లోకంలో ఎన్నెన్నో సీతాకోకల్ని చూడడంతో కాలం గడిచిపోవడం ఎంతదృష్టం మనిషికి. అంతకంటే అనుభూతి పొందే సమయాలుంటాయా ఈ లోకంలో దమ్ము చేసిన వరిచేనులో కొంగల సమూహం/ అలికి ముగ్గులేసిన ఇంటివాకిట గోరింకల సల్లాపం / సెలయేటి వడిలో పడి కొట్టుకు పోయే దూరప్రదేశపు లకుముకి పిట్టల జంట/ నిండు పారవశ్యంతో పెల్లుబికిన కోకిల పాట - ఎంతటి కల కూజితాలవి కవి నిరతరం దృశ్యాలను వెంటాడుతూనే ఉంటాడా ఏం. నిదురలోనూ మెలకువలోనే కలవరింతలు పెట్టే ఎన్నెన్ని కలలు పాటలు పాడతాడిలా. నిశ్శబ్ద వ్యాత్త ప్రవాసం వదలి / ఏప్రాచీనారణ్యంలోనికి చేయి పట్టి లాక్కు పోతాడో అనిపిస్తుంది.

మనకు ఇష్టమున్నా లేకున్నా తనే చేయి పట్టుకుని ఎండుటాకులపై ఒక్కో అడుగులో అడుగేయిస్తూ కనులు మూసుకుని అతని వెంటే మార్మికలోకపు అంచుల్లోకి లాక్కెళ్ళుతూ చిగురుటాకులు తినిపిస్తూ, దివ్య లోకాలు చూయిస్తూ కలలోలా మాట్లాడిస్తూ ఎంత సమ్మోహభరితం చేస్తాడో కవి.
మలి సంజ అలలమీంచి/నునులేత చీకటి / సరుగుడు తోటలో / ఒక్కొక్క వెండి మువ్వ విప్పారిన నీలిమ తెరిచాపని / శూన్యా కాశమ్మీదకు ఎగురవేస్తాడీ సరంగు / మనలో పలుతావుల్లో మేలుకునే సజీవ నిశ్శబ్దం / అగాధ రాత్రి పర్యంతం.

ఎన్నెన్ని అగాధాలు మనలో. నిర్జీవంగా సంచరించే మనుషుల్ని పిలిచి, చేసైగతో కూర్చోబెట్టి, కనుసైగతో తను అనుకున్న లోకంలోకి మనిషి నిజంగా అనుభవించే రాగాలను అందించి ఇదే కాదా నిజమైన జీవితం. ముమ్మాటికీ ఇదే అనిపించే చంద్రరశ్మి శంఖధ్వని కదా ఈ కవిత్వం.

ఆమెకై అతను అతనికై ఆమె ఎన్ని ఒంటరి ఎదురు చూపుల / రెపరెపల దీపస్తంభాలౌతారు. ఎంత కాలం ఎదురు చూస్తే నేమి, ఎన్ని సార్లు కలుసుకున్నా ఆరని తమకం ఎదురు చూపుల పూలతోటలో పూ సవ్వడలు వినిపిస్తాయి. పూల సుగంధాన్ని పూయిస్తాయి. నిన్ను తలుచుకుని / ఇవాళ తప్పక వస్తావని / లోపల్లోపల మురిసిపోయి / నీలం జ్వాలల్లే నవ్వు కోవడం లో ఎన్నెన్ని జ్వాలలు పూయిస్తాడీ కవి ఒంటరి మనిషి ఎదురు చూపుల అంచుల్నుండి.

రెక్కలు విరిగిన సీతాకోక చిలుక / కడపటి రెపరెపలుగా/ పలవరింతలు నిరీక్షణలో లీనమై / చీకటికి లేని / నీలం గంటల పువ్వొకటి / తొలి జామునే విరబూయటం ఎంత గొప్ప చమత్కారమో కదా! ఓ కవీ కన్నుల నిండా పువ్వుల్నీ, సీతాకోక చిలుకల్నీ, కాలి అందియల్నీ, కన్నీళ్ళలో కూడా పూసే గరిక పువ్వుల్ని ఎన్నెన్నో సృష్టిస్తావు. మకిల పట్టిన మనసు వాకిట కళ్ళాపి చల్లి ముగ్గేస్తావు. మూసుకుపోయిన కన్నుల్ని బలవంతంగానైనా తెరిచి చిత్రాలు పూయిస్తావు.

పట్ట పగ్గాలు లేని కాంచనమృగాలను రోజుల్లోకి అనువదించి / ఇనుప తీగెలు, నీల రక్త నాళాలూ కలగలిపి అల్లిన అల్లికలో ఎన్నెన్ని ఆకారాలు దర్శన మిస్తాయో బహుకాల పక్షిగానం / చెల్లా చెదిరి పోయే జ్ఞాపక పుంజం /దైనందిన పరిహాస ధూళి, వచ్చీ రాని మాటలతో, ఆత్మీయ బాంధవంతో ఎన్నెన్ని కవి సమయాలతో పూల గాయాలకు లేపన మద్దుతాడో ఈ చిత్రకారుడు. కవి కుంచెతో ఇన్నిన్ని దృశ్యాల్ని చిత్రీకరిస్తాడంటే నమ్మాలా వొద్దా! కళ్ళ ముందు ఇంత పచ్చి నిజ నీరెండలా తారట్లాడుతుంటే తప్పుతుందా కలలో జ్ఞాపకం లాగా.

నది దాటుతోన్న పడవలో నీకు మాత్రం అర్థమయ్యే అపేక్షలు / పొగమంచులో కలిసి మెసిలే ఈదురు గాలులు / నిడుపాటి రెల్లుపొదల నడుమ కాలిబాటలు దీర్ఘ స్వప్నాల అసహన పద ధ్వనికి నిమ్మళించిన గొంతుకలు వీటన్నిటి కోసం పరుగులు తీస్తే మాత్రం దొరుకుతాయా కఠినశిలలు కమ్మిన మాయ లోకంలో ఎన్ని సార్లు వగచినా కవికి దొరుకుతుంది కట్టుమట్లుపై కట్టు గొయ్యలకు కట్టిన పశువాసనలే. ఈ మాయాదారి లోకంలో మనషికి కావసిందేమిటో తిరుగు ప్రయాణంలో కళ్ళకు కడతాడు.

కుంకుమ రెక్కల సీతాకోక చిలుకల్ని, పొట్ట చేత్తో పట్టుకుని నవ్వే నవ్వుల్నీ, చీరంతటా విస్తరించిన ముద్దబంతి వువ్వుల్నీ దివా స్వప్నాలలోకి దించిన దాకా వంచిన తల ఎత్తని సృజన కారుడు ఎన్నెన్ని కలలు కంటాడో!

దేహతీరంలో ముద్దులు మూటకట్టుకొని కల్యాణ బంధమేదో ఊపిరితో అల్లుతాడు మోహపూరిత మాయా రాత్రిని తన తోవన తెల్లవారుస్తాడు. తేనియ కలలను కౌగిలింతల పర్యంతం చేస్తాడు. కవి ఒక చోట, ఒక సమయం, ఒక దృశ్యం అని కాకుండా ప్రతి చోటా తానే దృశ్యమై కనిపిస్తాడు. మనిషి ప్రతి క్షణాన్నీ ఎలాగ అమృతమయం చేసుకోవాలో దగ్గర ఉండి దృశ్యాన్నిండా మాలలల్లి, మనిషిని తన వనంలోకి ఆహ్వానించి సేద తీరుస్తాడు. ఎన్నెన్ని బాధల నుండో బంధ విముక్తుణ్ణి చేస్తాడు.

నిదురరాని ఎన్నెన్నో రాత్రులకు నిన్నెన్నో దివా స్వప్నాలతో జోలపాడతాడు. కలలు కనని మనిషిని తట్టి లేపి, కలల్ని కళ్ళల్లోకి వొంపి సేద తీరుస్తాడు. మనిషి అంతరంగాల్లో జొరబడి వలయాలు సృష్టిస్తాడు. ఖండితాంగాల వినిమయ విపణి నుంచి మనిషిని కాలూసేతులూ కూడ దీసుకుని స్వేచ్ఛ గానాన్ని ఆలపించమంటాడు. అరచేతుల్లోకి తీసుకున్న నిప్పుమీది నివురును కూడా సున్నితంగా ఫోటో తీసి చూయించే ఈ కవిత్వం బాధల మనసుకి వెన్నపుసని లేపనమద్దుతుంది. గాయాల నదికి నావల్ని అడ్డు కట్టలు వేయిస్తుంది. సుళ్ళు తిరుగుతున్న బాధల సందర్భంలో జీవన రహస్యాల్ని చెవిలో ఊది, సున్నితమైన పెదవులపై చిరునవ్వులు పూయిస్తుంది.

భౌతిక జీవితాన్ని వదలి మనిషి అంతరంగపు లోయల్లోకి పురా స్వప్న సౌధాల్లోకి, తనువును కరిగించుకుని, మనిషిని మంచుగా మార్చి, హృదయాన్ని పరిమళ భరితం చేసుకునే దివ్యగానమేదో అనువణువునా తన కవితల్లో వీణియ మీటుతాడు. పిల్లన గ్రోవితో సమ్మోహన పరుస్తాడు. శబ్దాలు లేని గానాన్నే దోసిట్లో వారబోస్తాడు. ఎప్పటెప్పటివో జారిపోయిన కలల్ని పోగు చేసి మూటకట్టి భుజాన వేసి ఇక బయలు దేరమంటాడు జీవన రహస్యాల్ని ఛేదించడానికి
జీవనసారం తెలియని ఎందరో బాట సారులకి బాటలు చూపి పచ్చికబయళ్ళు లో సేద తీరమంటాడు. లోకం తెలియని అమాయకులను తన మర్మలోకంలోకి మాయగా ఎగరేసుకువెళతాడు. తెగిన గాలిపటాలకు దారం పురిపేని గాలిలోకి ఎగరటం నేర్పిస్తాడు.

ప్రకృతిలో అందాలు చూడని వాళ్ళ దగ్గరగా వొచ్చి సూర్యోదయాన్ని చంద్రోదయాల్నీ, తెలిమబ్బుల ఛాయనీ, కురేసే వానల్లో తడిసే కొంగల్నీ, ఎగిరే పిల్లన్నే నడిచే పడవల్నీ, వడివడిగా పారేసెలయేరుల్నీ, కాంతిమయ ఇంద్రధనుసుల్నీ చూయిస్తూ ఇక ఇలా బతకండని ఇంకో కొంగల బారు దగ్గరకు వెళ్ళి కలల్లోకి కూరకుపోవడంలో నిమగ్నమౌతాడు.

ఈయన స్వప్నాల్ని దోసిళ్ళతోనూ, దృశ్యాలను కౌగిళ్ళితోనూ బంధించడంలో బహునేర్పరి. పురాతన కాలాల్ని వర్తమానాల్లోకీ, వర్తమానాలను భవిష్యత్తులోకీ పరుగెత్తిస్తూ, వాటి వెంటబడి తానూ పరుగెత్తుతాడు.

ఒంటరి జీవితాలకు ఆలంబనౌతాడు. స్థిర జీవితాలకు పరిచయ వాక్యాలు నేర్పిస్తాడు. బతకడం చేతకాని కళాకారులకు కళల నైవైద్యం ప్రసాదంగా పంచుతాడు. యవ్వనాలను వీడిన వాళ్ళకు యవ్వనాలు పూయడం నేర్పుతాడు. య్వవనంతో విర్రవీగే వాళ్ళకు పూల సవ్వడులు వినడం నేర్పుతాడు. పసిబిడ్డలకు చెట్లు ఎక్కడం నేర్పుతాడు. చెట్లకు పసిబిడ్డల భాష నేర్పుతాడు.

మొత్తంగా తానొక ముకుళిత కలువల కన్నీరింకని కొలలనును అంటూ తనను తాను తడితడిగా తడుముకుంటాడు.

వ్యాకరణాంశాలు, అలంకారాలూ, దృశ్యాలూ, ఆకారాలూ ఎన్ని కావాలంటే అన్ని పోగుచేసుకోవొచ్చు కానీ ఈ కవిత్వంలో దిగి అలుపు వొచ్చినంత సేపు ఈది వొడ్డుకు వొచ్చెసరికి మళ్లీ రారమ్మని పిలిచే ఈత కొలను. ఎంతని పరవశించను. ఎన్ని మార్లని పలవరించను. ఇది వీడిపోని స్వప్నం. వదిలివేయని నేస్తం. అంటి పెట్టుకునే హృదయం ఎన్ని సార్లయినా ఎంత దూరమైనా నడిచి వెళ్ళే బంగారు బాట. కవిత్వ ప్రేమికులను బంధించే బంధన చాయ.

*
ప్రతులకు : బంధన ఛాయ రచయిత - నామాడి శ్రీధర్‌, అంబాజీపేట, తూర్పుగోదావరి, ఆంధ్రప్రదేశ్‌, పిన్‌ - 533214, వెల రూ.50/- ఫోన్‌ 9396807070

2 కామెంట్‌లు:

  1. గొప్ప కవిత్వానికి అంతే గొప్ప పరిచయం.

    చాలా చాలా బాగుందండీ.

    ఈ పుస్తకం గురించి గత నెలగా నేను ప్రతీరోజూ మావూరి విశాలాంద్ర షాపు వానికి తెప్పించమని చెపుతూ ఉన్నాను.

    మొత్తానికి మీ వ్యాసం ద్వారా శ్రీధర్ గారి నంబరుకు ఇప్పుడే ఫోను చేసాను.

    ఆయనతో మాట్లాడటం గొప్ప అనుభూతి.

    అందుకు మీకు ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను.

    మరొక్క మాట,

    ఈనాడు కవిత్వాన్ని మాత్రమే రాసే కవులలో శ్రీధర్ గారు ఒకరు.

    చాలా చాలా కొద్దిమందిలో ఒకే ఒక్కడు అనటానికి నేనేమీ సంకోచపడను.

    భవదీయుడు

    బొల్లోజు బాబా

    రిప్లయితొలగించండి
  2. అధ్బుతం అండి. ఎంత మంచి పరిచయం. మీ పరిచయం చదివేక తప్పక పుస్తకం చదవాలని అనిపిస్తోంది, మీతో ఇంత కవితాత్మక పరిచయం రాయించిన పుస్తకమెంత గొప్ప గా వుండాలి అని. ఈ పరిచయపు మత్తు నుంచే అంత తొందర గా బయటకు రాలేక పోతున్నా, పుస్తకం చదివి ఏమైపోతామో అని భయం కూడా వేస్తుంది సుమీ.. చాలా బాగా రాసేరు ఎంత భావనాత్మకం గా వున్నాయండి వాక్యాలు. ప్రతి వాక్యం మనసులోకి ఇంకి పోతున్నాయి అంతగా మంచి భావన ల కోసం నెర్రు లు చాచి ఎదురు చూస్తున్నట్లుంది కవితా హృదయం.

    రిప్లయితొలగించండి