13 సెప్టెం, 2011

నాన్నను చూశాక

నాన్నను చూశాక
గ్రీష్మం యధాలాపంగా
తాపాన్ని ప్రకటించింది
ఎండలు వెన్నెల నీడల్ని వెదజల్లుతున్నాయి
నేత్రాలు సైతం అగ్ని గోళాలుగా మారుతున్నాయి
అరికాళ్ళు పగుళ్ళిచ్చి
కత్తి అంచు మీద విన్యాసాలు పోతోంది
నాలుక అంగిట్ళోకి పిడచకట్టూకపోతుంది
చుట్టూతా ఎటు చూసినా నేలను ఎడారి ఆవరించుకుంటోంది
ఎటునుంచొచ్చే గాలైనా వడగాడ్పులే వీస్తోంది
నేలపైననే సుడిగుండాలు గింగుర్లెత్తుతున్నాయి
నిర్జలమైన దేహం శుష్కించి
చివరి అంచులకు చేరుకుంటోంది
వన దేవత నీగ్రో సుందరి రూపం దాలుస్తుంది
అయినా ఆయన క్రీస్తంత దయాళువు
నాపై హిమాలయాలంత ఆప్యాతలు పంచుతూ
నా వసంత కాలం కోసం
ఆయన గ్రీష్మాన్ని నిరంతరం
శాలువలా వొళ్ళంతా ధరిస్తూనే వున్నాడు

10 సెప్టెం, 2011

ఆమె


ఒక్కోసారికలవరపాటు
ఏ రూపంలోనైనా
దృశ్యాన్ని దోచుకుంటుంది
పైరగాలి చాటు నుండి కదలిపోతున్న కలహంసలా
వులికిపటుకూ వూపిరందిస్తుంది
అనుకుంటాంగానీ
మనకు తెలియకుండానే
గుండెల్నిండా వూపిరి పీల్చుకున్నంత నిండుగా
నల్దిక్కులూ భూకంపం తాకినంత వుదృతంగా
హృదయం కంపిస్తుంది
ఏమీ తెలియని హద్దుల ఆనవాళ్ళలో
కలువల కన్నులు చూపు సారించిన బాణమైనప్పుడు
కంపించడమంటే
ఆమెను చూసినప్పుడే
ఈకంపనమే గొప్ప స్వాప్నిక దృశ్యం
ఎందుకయ్యా ఈ సృష్టిలో
ఇన్నిన్ని రంగురంగుల మయూరాలూ
మనసుని కంపింప చేసే ప్రకృతి దృశ్యాలూ
మరీ ముఖ్యంగా
ఎన్నెన్ని జన్మ లెత్తినా ఎంతెంతగా వీక్షీంచినా
తనివి తీరని ఆమె సౌందర్యాలూనూ.....................

ఉపాధ్యాయ సంఘాల నాయకులకిది తగునా !


విధ్యార్థుల స్థాయిని బట్టి ఉపాధ్యాయుల బోధనను అంచనా వేయడం సమంజసం కాదని ,విద్యార్థుల సామర్థ్యాలు కేవలం ఉపాధ్యాయుల బోధన పైననే ఆధార పడి వుండవని ,విద్యార్థుల ఫలితాలను బట్టి ఉపాధ్యాయులను సాధిస్తే ఉద్యమలను చెయ్యల్సి వస్తుందని ఉపాధ్యాయసంఘాల నాయకులు ప్రకటించడమే మహా విడ్డూరంగా అనిపిస్తుంది
విద్యార్థుల సామర్ద్యాలు ,అభివృద్ధి కేవలం ఉపాధ్యాయుల బోధనా తీరు పైననే ఆధార పడి వుంటాయి.ఏ పిల్లలు ఏ స్థాయిలో వున్నారో గమనించి వారికి తగినట్టుగా బోధిస్తే ఫలితాలు అద్భుతంగా వుంటాయని నిరూపిస్తున్నాము.గత 2 సంవత్సరాలుగా ఉపాధ్యాయ శిక్షణలు అధ్బుతమైన లక్ష్యసాధనాల దిశగా సాగుతున్నాయి.రిషి వేలీ ప్రయోగాలను కూడా ఈ శిక్షణలో పొందుపరచడం జరిగింది.మరి ఇంతకంటే ఉపాధ్యాయులు నేర్చుకునేదేమైనా వుందా.
అయితే ఉపాధ్యాయులు శిక్షణలను మొక్కుబడిగా తీసుకోవడము,వారికి ఉపాధ్యాయ సంఘాలు వత్తాసు పలకడము సర్వ సాధారణ మై పోయింది.కనీసం సంఘాల నాయకులకైనా శిక్షణల పట్ల అవగహన వుంటే ఇలాంటి ప్రకటనలు ఇచ్చి వుండే వారుకాదు. ఎన్నెన్నో వినూత్న పద్దతులు వస్తుంటే మెకాలే కాలంనాటి వుపన్యాస పద్ధతినే ఇప్పటీకీ పాటిస్తుంటే ఏ విధ్యార్థులలోనూ ఎలాంటి ప్రగతిని సాధించలేము
ఉపాధ్యాయులు నూతన పోకడలు అందిపుచ్చుకుంటే విధ్యార్థులలో ఏ సామర్థ్యాలైనా అభివృద్ధి చెయ్యవచ్చు కానీ ఉపాధ్యాయలోకం ఏదైనా కొత్తగా నేర్చుకోడానికి సిద్ధంగా వుందా! నేర్పడానికి ఉపాధ్యాయ సంఘాలు సిద్ధంగా వున్నాయా !విద్యా సదస్సులంటే కేవలం ఆప్రాంత నాయకులను అధికారులను పిలిచి మొక్కుబడిగా సాగే వుపన్యాసాలు తప్ప ఏదైనా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారా!
ప్రపంచీకరణ ప్రైవేటీకరణ విద్యా వ్యవస్థను తల్లక్రిందులుగా చేస్తున్నా...ఏమీతెలియనట్టు పాలుతాగే పిల్లి చందంగా ఉపాధ్యాయ సంఘాలు వ్యవహరిస్తే రాబోయే కాలంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
ఉపాధ్యాయుల సంక్షేమం తో పాటుగా విధ్యార్థుల సంక్షేమాన్ని చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయ సంఘాలు గుర్తెరగాలాల్సిన సమయం ఆసన్నమైంది.విద్యార్థుల కోసం ఉపాధ్యాయులు కానీ,ఉపాధ్యాయులకోసమే విద్యార్థులు కాదు కదా!