11 ఆగ, 2011

నగరంలో దారి తప్పిపోయిన మనుషులు

నగరంలో దారి తప్పిపోయిన మనుషులు

నగరంలో మీరు అటో ఇటో తిరుగుతున్నప్పుడు

ఎక్కడైనా రోడ్డు మీద నీరు కావి పంచె కట్టు మనుషులు కనడితే

చీదరించుకుని తలలు తిప్పుకుని పోవొద్దు

వాళ్ళు అంతకు ముందెప్పుడో

మన నాన్నలో అన్నలో అయి వుండొచ్చు

మనం తొక్కుకుంటూ తోసుకుంటూ బస్సు లెక్కుతున్నప్పుడు

మట్టి వాసన వేసే మనుషులు కనిపిస్తారు

వాళ్ళను చూసి నొసలు చిట్లించుకోవొద్దు

వాళ్ళుఅప్పుడెప్పుడో మన తాతలు ముత్తాతల్లాంటి వాళ్ళు కావచ్చు

గడ్డాలు పెరిగి మట్టి గొట్టుకు పోయిన మనుషులు చెయ్యెత్తితే

ఆటో వాడికైనా ఈసడింపు పుట్టొచ్చు

కాస్త ఆటో ఆపి వాళ్ళను ఎక్కించి పుణ్యం కట్టుకోండి

వాళ్ళు మనకు అన్నం పెట్టి కడుపు నింపే రైతన్నలే కావొచ్చు

నగరం అరణ్యం కదా

ఆ అరణ్యంలో దారి తప్పిన దానయ్యలు

నోరు పిడచ కట్టుకుపోయి అడ్డం పడి పోవొచ్చు

కాసిని మంచినీళ్ళు మొహాన కొట్టి లేపండి

వాళ్ళు అనంత దయామయులైన పల్లె ప్రవక్తలు కావొచ్చు

మనసు వద వద లాడుతూ

వొళ్ళంతా చెమ్మతో తిరిగే మనుషులు కనబడతారు

బండరాళ్ళ మన కంటికి మనుషులుగా వాళ్ళు కనబడక పోవొచ్చు

వాళ్ళను చూసి మనుషులెలా వుంటారో కాస్త గుర్తుకు తెచ్చుకుందాం

వాళ్ళు మానవత్వం తప్ప మరేమీ తెలియని మన పూర్వీకులు కావొచ్చు

ఇక్కడ తిక్కల తిక్కలగా దిక్కులు చూసే అరవ్వోళ్ళు కనిపించొచ్చు

వాళ్ళని పిచ్చివాళ్ళ కింద జమ కట్టొద్దు

వాళ్ళు ఇంటింటికీ వూరూరికీ

రహదార్లేసిన రాయబారులు కావొచ్చు

లుంగీ బొడ్డు కాడికి ఎగ్గట్టి తల ఆకాశంలోకి ఎగరేస్తూ

బారెడు బారెడు అంగలు వేసే వాళ్ళని చూసి

ఎవుడ్రా ఈ బైతుగాడని దూరదూరంగా తొలగొద్దేం

వాళ్ళు వూళ్ళో ఎవురికే రోగమూ రొష్టూ వొచ్చినా ముందుగా పరుగులు తీసే

మన బాబాయిలూ మామయ్యలూ కావొచ్చు

కాళ్ళు వొడిలిపోయి నడుం వొంగిపోయి

బోటుకర్ర పొడుచుకుంటూ

రోడ్డు దాటడానికి తంటాలు పడే పండు ముసలోళ్ళు కనపడితే

మీ ఏసీ కార్ల బ్రేకుల మీద కాలు పెట్టడం మరిచిపోకండేం

వాళ్ళు మనల్ని భుజాలకెత్తుకుని

మోస్తూ కథలు చెప్పిన తాతయ్యలు కావొచ్చు

మోకాళ్ళు దాటే కరక్కాయ చెడ్డీలేసుకుని

రోడ్డు కడ్డంగా పరిగెత్తే పిల్లకాయల్ని చూసి విసుక్కోకండేం

వాళ్ళు బాల్యంలో మన సావాస గాళ్ళెవరైనా కావొచ్చు

సైకిలు మీద రోడ్డంత పొడుగు గడ్డి మోపుల్ని లాక్కుపోతుంటారు

వాళ్ళను చూసి కసురుకోవొద్దేం

పాటిమీద నుండో గరువు చేలో నుండో

మనం మోసిన మోపులు ఒక్కసారి గెవనానికి తెచ్చుకోండి

పాల తపేళాలు తీసుకుని వాకిటి ముందుకొస్తుంటారు చూడు

అమాయకంగా మొకాలు వేలాడేసుకుని

కడుపుకూటి కోసం వొస్తారు వాళ్ళు కామంగా చూడకండేం

వాళ్ళు ఎప్పుడో మన అక్కయ్యలో చెల్లెళ్ళో కావొచ్చు

ప్రాణాల్ని గుప్పెట్లో పెట్టుకుని వైద్యుణ్ణి దేవుళ్ళా చూస్తూ కాళ్ళు మొక్కుతూ

ఆసుపత్రుల వాకిట అడుగుపెడతారు వాళ్ళు

లాభనష్టాల బేరీజు వాళ్ళమీద వేసుకోకండేం

వెనకటికి మన అయ్యలో అమ్మలో అయ్యుంటారు వాళ్ళు

ఎవుడో డలారి ముండా కొడుకు బారిన పడి

కోర్టు మెట్లెక్కాల్సి వొస్తుంది పాపం వాళ్ళకు

తల కొట్టేసినట్టున్నా తప్పక వొస్తారు

వాళ్ళను ముద్దాయిలుగానే చూడకండేం

వాళ్ళు వెనకటికి నీతీ నిజాయితీగా బతికిన మన గ్రామ పెద్దలే కావొచ్చు

కాళ్ళ జోళ్ళు లేకుండా రోడ్డు కడ్డం పడతారు వాళ్ళు

కాయకష్టం మనుషులు వాళ్ళు

కూడలి కూడలికీ అడ్డాల నిండా గుంపులు గుంపులుగా

అరసకలాడుతుంటారు వాళ్ళు

పశువులనుకుంటారేమో

ఆకలి కేకల చకోర పక్షులు వాళ్ళు

వీళ్ళంతా లేకుంటే క్షణ కాలం కాలు కదపలేని అవిటి వాళ్ళం మనం

పైపై పూతలు తగిలించుకు తిరిగే నాటకాల రాయుళ్ళం మనం

లోపలి ప్రేమా ఆప్యాయతలు బంధాను బంధాలు

పచ్చటి చేలలా పండించేది వాళ్ళు

ఆ పైర గాలి వీచందే ఏ పంటా పండదు

తరతరానికీ వారధి కట్టే మారాజులు వాళ్ళు

వాళ్ళు లేందే ఏ ఇంటా కడుపు నిండదు

1 కామెంట్‌: