25 జూన్, 2010

పొలం అమ్మడం బాధగా ఉంటుంది

ఎంతోమురిపెంతో ఆప్యాయంగా పెంచుకున్న

పచ్చటిపైట చుట్టుకున్న పైరుతల్లులు

వడివడిగా సుడులు తిరిగే పంట కాలువలు

పంటలపై వల విసిరేసినట్టు గబుక్కున వాలే

పక్షుల గుంపుల నొదిలి

పొలం అమ్మడం చాలా బాధగా ఉంటుంది

తెలతెలవారక ముందే పొలందారి వెంట

గడ్డి పూలపై మంచు బిందువుల మాటలతో

అక్కా బావా అన్నా వదినా అంటూ పిలిచే వలపుల పిలుపులు

పక్క పక్క చేలల్లో నుండి జాలువారే

బావా మరదళ్ళ నవరసాల వరసల సరసాలు

ఆకుపచ్చదారంతా వచ్చే పోయే వాళ్ళ ఆప్యాయతా పిలుపులనొదిలి

పొలం అమ్మడం చాలా బాధగా ఉంటుంది

వర్షానికి తడిసి ఆవిరై ఎగసిపడే

కమ్మటి నేలతల్లి సువాసనల నొదిలి

మేలిమి విత్తనాలనుండి

కువకువల్తో తొంగిచూసే కోడిపిల్లల్లాంటి

లేలేత మొక్కల్నొదిలి

పొలం అమ్మడం చాలా బాధగా ఉంటుంది

పండిన చేలు తలలూపుతూ పాడే పాటలు

గాలి నలువైపులా మోసుకుపోయే కొత్త ధాన్యపు ఘుమఘుమలు

బండినిండా బస్తాలు నింపుకొని చెర్నాకోలతో

ఎద్దుల్ని ఆప్యాయంగా అదిలించే అదిలింపుల నొదిలి

పొలం అమ్మడం చాలా బాధగా ఉంటుంది

కల్తీ పురుగు మందులు నకిలీ విత్తనాలు

సకాలంలోపడని వర్షాలకు

ఎన్నిసార్లు నష్టాల ఊబిలో కూరుకు పోతున్నా

గోడక్కొట్టిన బంతిలా

మళ్ళీ మళ్ళీ దుక్కి దున్ని విత్తులు చల్లినా

ఆశలు మోసులెత్తక

రాశులు రాశులుగా పెరిగిపోతున్న

అప్పులు తీర్చేందుకు

పొలం అమ్మడం బాధగా ఉంటుంది

1 కామెంట్‌: