13 జులై, 2010

లోయలు కొండలు జలపాతాలు






ఎన్నెన్ని కొండలో జంటలు జంటలుగా
చేతుల్చేతులు పట్టుకుని
ఎన్నేళ్ళ నుంచో ధైర్యంగా నిలబడి ఉన్నాయి

కొండలపై అక్కడక్కడా
గోధుమ పంట
పర్వతాల తలపై పాపిట తీసినట్టు

పర్వతాలు వళ్ళు విరుచుకుని
పవ్వళించాయనుకుంటే
హఠాత్తుగామంచు వర్షం
తెల్లని పాలపాట పాడింది

పర్వతాలు
చీకట్లో మునిగి పోతున్నాయని
సూర్యుడు ఒక వెలుతురు తునకను విసిరేడు
భళ్ళున తెల్లారిపోయింది

చిక్కటి చీకట్లో చెట్ల వరుసలు
వాటి మధ్య
వెలుతురు తుంపులు తుంపులుగా
రాలి పడుతుంది

ఆ కొండ చరియలపై
శిల్పులు చెక్కని
అపురూపమైన శిల్పాలెన్నో

పర్వత పాదాల ముందు
మోకరిల్లి అనుకునే వాడిని
ఆ కొండలు ఆకాశాన్నంటుతున్నాయని
ఇప్పుడా కొండలు ఓడిపోయి
నా పాదాలకు నమస్కారం చేస్తున్నాయి

మా ఇంటి ముంగిట మందారం చెట్లు
ఒళ్ళంతాఎర్రెర్రని కళ్ళయి మురిపించేయి
ఇన్నిన్ని పూవనాల మధ్య నోట మాటే రావడంలేదు

మనం మౌనంగా నడుస్తుంటే
ప్రకృతి మాట్లాడుతుంది
చెట్లు వంగి నమస్కారం చేస్తాయి
జలపాతాలు గలగలా నవ్వుతాయి
కొండలు గుండెలకు ధైర్యాన్నిస్తాయి
సాగిపోతున్న బాటసారులకు సెలయేళ్ళు
వీడ్కోలు చెబుతాయి

నేనిక్కడ ప్రకృతిని పూటుగా తాగాను
కోయిల్లా పాడ్డం మొదలు పెట్టాను

ఎంతో నేర్చుకున్న మేధావినని
ఇంత కాలం విర్ర వీగాను
తల్లీ నీదగ్గరకొచ్చాక తెలిసింది
నేనొక నిరక్షరాశ్యుడనని

ఎవరెవరు చెక్కారీ శిల్పాలను
ఎన్నెన్నో వగలు పోతున్నాయివి

ఈ మంచు బిందువుల బుగ్గల్తో
ఆ సూర్యకిరణాల పెదాలు
దోబూచులాడుతున్నాయి

అప్పుడప్పుడా మేఘాలు
కొండల అంచుల్ని
ముట్టుకుంటున్నాయా
ముద్దెట్టుకుంటున్నాయా

హిమాలయాలు-హిమపాతాలు


అమ్మో ఇంత మంచా అని
కేరింతలు కొడుతూ
ఆబగా ఎగిరి దూకేను
నా బాల్యంలోనికి
మౌనంగా తిరిగి వెళ్ళి పోయాను

సూర్యుడు మంచు ముక్కని
ముద్దాడాడు
అక్కడ వజ్రాల లోకం ప్రత్యక్షమైంది

ఎంతో ఆరాటంతో మంచుని
చేతుల్లోనికి తీసుకున్నాను
ఎంతో సేపు ఉండలేదా సంతొషం
కరిగి కన్నీరై పోయింది

ఆకాశం నుండి
మంచు ముత్యాలు
తారకల్లా కురుస్తూనే ఉన్నాయి

మంచు వెన్నెల్లో
ఎన్నెన్ని నెమళ్ళు
పురివిప్పి నాట్యం చేస్తున్నాయి

ఇన్ని జలపాతాలు దాటినా
ఈ ప్రకృతి దాహం
తీర లేదేమిటో

వాళ్ళందరూ సుకుమారమైన
చూపుల్తో ఎన్నో అందాల్ని పట్టుకున్నారు
నేనా వొగుడాకు వృద్దుని
చేతులు పట్టుకున్నాను
వాళ్ళంతా సుందరమైన అందాల్లొ తడిశారు
నేనాయన దుఃఖంలో
పునీతుణ్ణయ్యాను

ఆ జలపాతం
అజంతా సుందరంత అందమైంది
చూడాల్సిందే గానీ ముట్టుకోలేనంత
ఆకాశాన ఉండి పొయింది

చెట్లు ఆకులు కొమ్మలు
పువ్వుల్ని కన్నాయి
పూలు సువాసనల్ని వెదజల్లి
వనం రుణం తీర్చుకున్నాయి

ఎంత దూరం పోయినా
పర్వతాలు చేతులు సాచి
రారమ్మని ఆహ్వానిస్తూనే ఉన్నాయి
పెదాలు విచ్చుకుని నవ్వుతూనే ఉన్నాయి

అక్కడక్కడా మంచు ముక్కలు
లోయల జడల్లో ఎవరు తురిమేరో
మబ్బు తునకల్లా

ఇన్ని మెట్లున్నాయా స్వర్గానికి చేరడానికి
ఆమె గునుస్తూనే ఎగబాకుతుంది

అక్కడికెక్కేసరికి హఠాత్తుగా పర్వతాలపై
గంపలతొ మంచును ధారగా పొస్తున్నారెవరో

చీకటి మైదానం పైకి పరుగున వొచ్చాడు
చంద్రుడు వెలుతురు వర్షమం
ధారగా కురుస్తుంది

తెలతెల్లనిరాళ్ళు
నది నిండా నీళ్ళు
దొర్లుకుంటూ
వచ్చిన కొండ
వాలు నీటిలోకి జారిపోయింది

సూర్యుడు ముందుకు వంగి
సహస్ర బాహువులతో
వెలుతురు వారబోస్తున్నాడు

ఈ జలపాతం వయ్యారంగా వచ్చి
ఆమె ముమ్దు నిల్చుంది
ఆమె అడిగిందీ
అతని కబురేమన్నా మోసుకొచ్చావా అని

వర్షం వెలిసింది
చెట్లన్నీ తలారా స్నానం చేసి చిక్కులు తీసుకుని
సోకులు చేసుకుంటున్నాయి

గడ్డిపూలు చల్లగాలుల సంగీతానికి
తలలూపుతున్నాయి
కరకు పాదాలు పైనుండి కదిలి పోగానే
దీనంగా తలలు వంచేశాయి

ఆమె కోసం ఎన్నో రాత్రులూ పగళ్ళూ
ఎదురెదురు చూశాను
పరుగెత్తి పరుగెత్తి అలిసిపోయాక
నా చేతికి దొరికిందామె
అప్పటికే ఆమె గుండె
మంచులా కరిగి పోయింది

11 జులై, 2010

హిమాలయాలు




పర్వత పాదాల వద్ద ఉన్నప్పుడు

అమ్మో అంత ఎత్తు ఎక్కగలమా

అనుకున్నాము

ఇక్కడికి వచ్చాక తెలిసింది

ఇంకా ఎంతెత్తైనా ఎక్కగలమని


దూది పింజల్లో నుండి కుంచెల్తో అద్దుకుని

పర్వతాలకు రంగు రూపు లు

దిద్దుతున్నాయి చెట్ల కొమ్మలు


క్షణానికొక చీర కట్టుకుని వొస్తుంది

ఎంత గొప్ప చిత్ర కారిణి ఈ ప్రకృతి


ఆ చెట్ల శిఖరాలను కూడా

దాటామని

ఎంతగా వెక్కిస్తున్నాయా చెట్లు


అమ్మో అంతెత్తున నుంచొని కిందకు చూస్తే

ఎంత భయం గొలిపే దృశ్యమో

అయినా ఎంత అందంగా ఉందో


ఆ పర్వతం దాటితే

ఆవల లోయంతా

ఆకాశమే పరుచుకుని ఉంటుంది


ఆకాశమంత విశాలమైన

మైదానంలో

ఈ మౌనం ఎంత మనోహరంగా ఉంది


ఆ కనుచూపు మేర కనిపించే

ఆకుపచ్చని సముద్రములో

ఎన్నెన్నిసార్లని దొర్లాలి

3 జులై, 2010

సాహిత్యం మనిషికి జ్ఞానాన్ని ఇవ్వాలి కదా !

మన తెలుగు సాహిత్యంలో ఇవాళ ఏం జరుగుతుందో చూస్తుంటే ఎంతో బాధ పడాల్సి వస్తుంది. సాహిత్యం అంటే కేవలం సభలు ,సన్మానాలు, పొగడ్తలు,అవార్డులు ,సత్కారాలు ,గ్రూపులు ,చీత్కారాలు, పగలు,ప్రతీకారాలు,పరిచయాలు,ఇలాగ చెప్పుకుంటూ చెప్పుకుంటూ పొతే అంతూ పొంతూ ఉండదు. మరి ఎవరికో ఏదో చెప్పాలని, ఎవరినో సంస్కరించాలని,ప్రస్తుతాన్ని సహజంగా మనిషికి అవగాహన కావించాలని సాహిత్య కారులుగా నడుం కట్టిన మనమే ఇన్నిన్ని ప్రలోభాలకు,ప్రభావాలకు లోనైతే మరి మన పాటకుల సంగతి ఏమిటి ?ఇలాగే పరిస్థితి కొనసాగితే పుంఖాను పుంఖాలుగా వస్తున్న సాహిత్యాన్ని బలవంతంగా వాళ్ళపై రుద్దితే సామాన్యులు పాపం వాళ్ళు ఏమై పోతారు తప్పకుండా మళ్ళి మనందరం ఒక్కసారి వెనక్కు తిరిగి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది మన కోసం మన తెలుగు వాళ్ళ కోసం మన సాహితి కారుల కోసం, ఇవాల్టి తరం కోసం కూడా .

28 జూన్, 2010

కిచకిచలు

వొరిచేలు పాలు పోసుకున్నప్పటి నుండీ
కళ్ళారా చూస్తూనే ఉంటాము
ఆయన గాలి పీల్చినంత గుర్తుగా
రోజూ వొరి ఎన్నులు
గుప్పిట పట్టుకొని గుర్తుగా రావడం
ఇంటి ముంగిట మైమరిచి పోతూ వేలాడ దీయడం
పిచ్చికలు సైగ సైగ్గా పందిట్లోకి
ఎగురుకుంటూ రావడం
చిరు సవ్వడికి ఎగిరి పోయినట్టే వెనక్కు పోవడం
మళ్ళీ నేలమీద వాలడం
అడుగు దీసి అడుగేయడం
ఎగరడం వాలడం
ఎన్నుల్ని కన్నుల్నిండా కలగనడం
కాళ్ళు ముందుకీ కళ్ళు పైకీ చక్రాల్లా తిప్పడం
బతుకంత భరోసా దొరికాక
రివ్వున గాల్లోకి ఎగిరి ఎన్నులపై వాలడం
ఎన్నెన్నో కిచకిచల్ని రాల్చడం
గింజల్ని గానం చెయ్యడం
పాటలు విని మానాన్న పరవశం చెందడం
కరిగిపోని చెరిగిపోని కల ఈడేరినట్టు పరవసించడం
రోజూ చూశే సెలయేటి పాట
ఇంటింటి పంచలో నెమలి ఆడే ఆట

25 జూన్, 2010

మా ట్రెక్కింగ్ మేమూ




పొలం అమ్మడం బాధగా ఉంటుంది

ఎంతోమురిపెంతో ఆప్యాయంగా పెంచుకున్న

పచ్చటిపైట చుట్టుకున్న పైరుతల్లులు

వడివడిగా సుడులు తిరిగే పంట కాలువలు

పంటలపై వల విసిరేసినట్టు గబుక్కున వాలే

పక్షుల గుంపుల నొదిలి

పొలం అమ్మడం చాలా బాధగా ఉంటుంది

తెలతెలవారక ముందే పొలందారి వెంట

గడ్డి పూలపై మంచు బిందువుల మాటలతో

అక్కా బావా అన్నా వదినా అంటూ పిలిచే వలపుల పిలుపులు

పక్క పక్క చేలల్లో నుండి జాలువారే

బావా మరదళ్ళ నవరసాల వరసల సరసాలు

ఆకుపచ్చదారంతా వచ్చే పోయే వాళ్ళ ఆప్యాయతా పిలుపులనొదిలి

పొలం అమ్మడం చాలా బాధగా ఉంటుంది

వర్షానికి తడిసి ఆవిరై ఎగసిపడే

కమ్మటి నేలతల్లి సువాసనల నొదిలి

మేలిమి విత్తనాలనుండి

కువకువల్తో తొంగిచూసే కోడిపిల్లల్లాంటి

లేలేత మొక్కల్నొదిలి

పొలం అమ్మడం చాలా బాధగా ఉంటుంది

పండిన చేలు తలలూపుతూ పాడే పాటలు

గాలి నలువైపులా మోసుకుపోయే కొత్త ధాన్యపు ఘుమఘుమలు

బండినిండా బస్తాలు నింపుకొని చెర్నాకోలతో

ఎద్దుల్ని ఆప్యాయంగా అదిలించే అదిలింపుల నొదిలి

పొలం అమ్మడం చాలా బాధగా ఉంటుంది

కల్తీ పురుగు మందులు నకిలీ విత్తనాలు

సకాలంలోపడని వర్షాలకు

ఎన్నిసార్లు నష్టాల ఊబిలో కూరుకు పోతున్నా

గోడక్కొట్టిన బంతిలా

మళ్ళీ మళ్ళీ దుక్కి దున్ని విత్తులు చల్లినా

ఆశలు మోసులెత్తక

రాశులు రాశులుగా పెరిగిపోతున్న

అప్పులు తీర్చేందుకు

పొలం అమ్మడం బాధగా ఉంటుంది

18 జూన్, 2010

మన ప్రభుత్వాలు సిగ్గుపడేది ఎప్పుడు?

కోట్ల రూపాయలు,వందల ఎకరాలు,వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు,ఇంకెంతోమంది కార్మికులు రేయింబవళ్ళూ శ్రమిస్తున్నారు మహానాడు విజయవంతం చేయడం కోసం. ఇది ఏ పార్టీజరిపే మహానాడు కాదు. ఒక భాష కోసం మన పొరుగునే ఉన్న తమిళనాడు ప్రభుత్వం తమిళ భాష కోసం జరిపే మహానాడు.ఐదు రోజుల పాటు జరిగే ఈ మహానాడులో పాల్గొనడానికి ప్రపంచములో ఉండే 50 దేశాల నుండి అనేక లక్షల మంది తమిళులు హాజరు అవుతున్నారు.
ఒక పాట ఒకే ఒక్కపాట కోసం 70 మంది గాయకులు,పరిశ్రమలోని సంగీత దర్శకులు అందరూ తలిళ జాతి ఔన్నత్యం కోసం ప్రాచీన తమిళ కవుల గొప్పతనాన్నిచాటేలా ముఖ్యమంత్రి కరుణానిధి, వాలి,వైరముత్తు లాంటి వారి సహకారంతో రాసిన పాటను రూపొందించటానికి రాత్రింబవళ్ళూ శ్రమించడం,స్వయంగా ఏ.ఆర్. రహమాన్ పాట పాడడానికి పూనుకోవడం నిజంగా ఆ భాష చేసుకున్న పుణ్యం ఆ అభిమానులు ఆ మట్టి ,ఆ సంస్క్రుతి కలకాలం నిలిచి ఉండడానికి ఆ భాషే వాళ్ళను కలకాలం కాపాడుతుందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది.
ఆ పడుగను ఆ రాష్ట్రమంతా కన్నుల పండుగగా చేసుకోవడానికి ప్రజలంతా సమాయత్తమవుతున్నారు.మరి వాళ్ళు భాషను అంతగా ప్రేమిస్తున్నారు .
అదే అదే మాభాష
జయహే జయహే జయహే అంటూ మన పొరుగున ఉన్న మన సోదరులు ఉప్పొంగిపోతున్నారు.మరి మనం... మన ప్రభుత్వాలు సిగ్గుపడేదెప్పుడు?

31 మే, 2010

మేధావులారా ఆలోచిద్దాం రండి !

ఏ సమాజపు స్థితిగతులైనా ఆ సమాజంలో అమలుచేసే విద్యావిధానంపైనే ఆధారపడి ఉంటుంది.సమాజంలో అనేకరకాలైన సమస్యలను పట్టించుకునే మేధావులు విద్యావంతులు సైతం భాషా,సంస్క్రుతి,విద్యలను పట్టించికోకపోవడం దురద్రుష్టకరం.
పసిపిల్లల నుండి యువకుల వరకు వారిలో ఉండే సామర్ధ్యాలను నిర్వీర్యం చేసే చదువులు అన్ని ప్రాంతాలకు పాకుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ ఉండడం ఒక్క తెలుగు సమాజానికే చెల్లింది.
ఐదు సంవత్సరాలనుండి మాత్రుభాషలో విద్యాబోధన వల్ల భాషాసామర్ధ్యం పెరుగుతుంది. ఆతరువాత ఏ భాష అయినా సులభంగా నేర్చుకోవడానికి వీలవుతుంది. ఏదేశంలోనైనా మాత్రుభాష ద్వారాబోధించే పద్దతే ఆమల్లో ఉంది.మన పిల్లలకు 2-3 సంవత్సరాలనుండే ఇంగ్లీషును నూరిపోస్తున్నాము.అంటే ఈ వయసులోనే పిల్లల్ని పక్కదారి పట్టిస్తున్నాము.మాత్రుభాష తెలియకుండానే ప్రాధమిక విద్య భాషా సామర్ధ్యాలు నేర్చుకోకుండానే పిల్లలు గట్టెక్కేస్తున్నారు.
ఇక ఆరవతరగతి నుండి ఐఐటి ఫౌండేషన్ పేరుతో ఊదర గొట్టేస్తున్నారు.ఉపాధ్యాయులంటే తప్పనిసరిగా మనోవిగ్నాన శాస్త్రం తెలిసిన వారై ఉండాలి.మరి మన పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులెవరు?పాఠ్యపుస్తకాలలోని విషయాన్ని పదేపదే బట్టీ కొట్టించి తరగతులు గట్టెక్కించేస్తున్నారు.అంటే పాఠ్యపుస్తకాలకు సంబంధించిన విషయాలుగానీ ,సామాజిక విషయాలు కానీ ఏమీ నేర్చుకోకుండానే పదవ తరగతి గట్టెక్కుతున్నారు.వీళ్ళకు భాష తెలియదు,సంస్క్రుతి తెలియదు.సమాజ స్థితి గతులు తెలియవు.పుస్తక పఠనమంటే అస్సలు తెలియదు.
ఇక్కడ నుండి కుస్తీ పోటీలు మొదలవుతాయి.పిల్లల ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యతగానీ అభిరుచులకు ప్రాధాన్యతగానీ ఉండదు.పొలోమంటూ నలుగురు నడిచే దారిలో కళ్ళు మూసుకోని పరుగులు తియ్యడమే.ఈ రెండు సంవత్సరాలు ఎంతగా రసం పీల్చి పిప్పి చెయ్యాలో అంతగా పిప్పిజేసి మార్కెట్ విద్య పేరుతో మార్కెట్లేని విద్యలోకి నెట్టేస్తున్నాము.అంటే ఇక్కడా పిల్లల ఇష్టాయిష్టాలతో పనిలేదు.ఒక అవగాహనలేదు.ఒక ఆలోచనలేదు,ఒక ద్రుక్పదములేదు,జీవితము మీద అంతకంటే అవగాహనలేదు.అలాంటి పిల్లలు సమాజములోనికి వస్తే ఏం జరుగుతుంది.అంతా అరాచకమే గదా !ఇలాంటి పశు ప్రవ్రుత్తి కలిగిన యువతరాన్ని సమాజము మీదకు వదిలి వేస్తున్నాము.ఇక సమాజములో మేధావులెలా పుడతారు.శాస్త్రవేత్తలు ఎక్కడి నుండి వస్తారు.సమాజాన్ని గురించి ఆలోచించేవాళ్ళు ఎక్కడి నుండి పుడతారు.కనీసం వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచించుకోలేని ఒక తరం మన కళ్ళ ముందు తిరుగాడుతూ ఉంది.
వీటికి తోడు ఇంటర్నెట్,సెల్ఫోన్,టీవీ వంటి మంత్ర సామాగ్రి ఉండనే ఉంది.వీటికి ఎంత సమయము కేటాయిస్తారో,వీటి ద్వారా ఏ దారి పడతారో తెలియని దుస్థితి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది.తల్లిదంద్రులు పిల్లల పట్టించుకునే స్థితి నుండి ఎప్పుడో దాటి వచ్చేసారు.ఇంత దుస్థితిలో మన తెలుగు సామాజిక పరిస్థితులు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి.ఇప్పుడే కదా మనమంతా ఆలోచించాల్సింది. ఇప్పుడే కదా వీళ్ళకుమనం అండగా నిలబడాల్సింది.ఇప్పుడే కదా మనము ఏదో ఒకటిచెయ్యాల్సింది.