30 మే, 2011

ఇప్పుడు మనుషులు మాట్లాడే మాటలు కావాలి

ఇప్పుడు మాటలు కావాలి
మంచి ముత్యాలు జల్లులుగా కురిసే
మాటల మమతలు కావాలి
పెదాల అంచుల్లో పూసే సుగంధ పరిమళాలు కావాలి
గాలి సయ్యాటల్లో తేలియాడే
పరిమళాలు వెదజల్లే పూదోటలు కావాలి
ఆప్యాయంగా పలకరించే హృదయపు ఆలింగనాలు కావాలి
అశాంతి వెల్లువై పారే మనుషుల వృక్షాల కొమ్మ కొమ్మనూ వంచే
తేటతేట తేనె పలుకులు మల్లెలుగా కురవాలి
కన్నుల సందిట పూసే సిరిమువ్వలు గజ్జెలుగా రాలాలి
కాలం కావ్యాన్ని నవ్వించే మాటలు పాటలు కావాలి
మానవ స్పర్శలు పెంచే హృదయ వీణియలు మీటే
గట్టిమాటల మనుషులు కావాలి
వెల్లువల్లో కొట్టుకు పోయే మనుషుల్ని ఆపి కూర్చోబెట్టి
సేదతీర్చే మాటల లేపనాలు కావాలి
అవి ప్రసరించే ఎల్లలు లేని ఆనందాలు కావాలి

18 మే, 2011

అణువణువునా

కనిపించిన
ప్రతి కొమ్మా రెమ్మా పైనా
నీ చెక్కిలి గులాబి సంతకంతరచి తరచి చూస్తాను
ఎ పక్షి గొంతులో పాటై పగిలినా
అది నువ్వే కృతి చేసి మీటిన
సంగీతమేనని చెవులారా వింటాను
అర విరిసిన ఎ పువ్వును చూసినా
అది నువ్వు నవ్విన నవ్వేమో నని
ఆత్రంగా దోసిలి పడతాను

అబద్దం వెనుక నిజం

ఫట్ మని విరిగే కర్ర ముక్కలా
పుటుక్కుమని పగిలే కుండ పెంకులా
తటాలున తెగిపోయే చెప్పు వుంగ టంలా
పై నుండి రాలిపడే తాటి మట్టలా
నిజం వెంట అబద్దంలా అబద్దాన్నంటు కున్న నిజంలా
సుఖం వెనుక దుక్ఖం లా
బ్రతుకు పటాన్ని
మరణమేప్పుడూ అంటి పెట్టుకునే వుంటుంది
యాంత్రిక సామ్రాజ్యం మనిషికి
మంత్రించి ఇచ్చిన మణిహార వరమిది

దేశభక్తీ జిందాబాద్

పిల్లికి బిచ్చం పెట్టరు
గొంతు ఎండి పోయే వాడికి
గుక్కెడు నీళ్ళు పోయ్యరు
పక్క మనిషి చావు బతుకుల్లో వున్నా
కన్నెత్తి కూడా చూడరు
విరిగిన వేలుపై వుట్టి పుణ్యానికి
ఓంటేలైనా పోయ్యరు
పచ్చి నెత్తుర్లు తాగడానికి
కత్తులనైనా కౌగలించు కుంటారు
కొన్ని సారా పేకెట్ల కే జీవితాల్ని బలి తీసుకుంటారు
నమ్మిన వాడి మూలుగుల్నించి
రక్తాన్ని జలగల్లా పీల్చుకుంటారు
క్రికెట్ మార్కేట్టాట కొట్లాటలో
ఒకే ఒక్క విజయానికే
వీరంగాలు వేస్తారు
టపాకాయలు కాలుస్తారు
మిఠాయిలు పంచుతారు
తాగి తమ్దనాలాడతారు
జెండాలతో చిందులు వేస్తారు
నానా రకాల నజరానాలు ప్రకటిస్తారు
వహ్వా దేశభక్తి జిందాబాద్